ఐదో రోజు సభలో ఎస్సీ వర్గీకరణ సహా ఐదు బిల్లులపై చర్చ
నేడు కూడా ప్రశ్నోత్తరాలు రద్దు

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఐదో రోజు కొనసాగుతున్నాయి. ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ బిల్లుపై సభలో చర్చ అనంతరం ఆమోదం తెలుపనున్న సభ. బిల్లుపై మంత్రి దామోదర రాజనర్సింహ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఎస్సీ వర్గీకరణ అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారు. ఎస్సీ వర్గీకరణతో పాటు మరో ఐదు బిల్లులపై చర్చ జరగనున్నది. యాదగిరి గుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు కోసం దేవాదాయ, ధర్మాదాయ శాఖ చట్ట సవరణ బిల్లుపై చర్చించనున్నారు. దీంతో పాటు న్యాయవాదుల సంక్షేమ నిధి, అడ్వకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెడుతున్నది. పురపాలక చట్ట సవరణ బిల్లును, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును కూడా ప్రభుత్వం అసెంబ్లీ లో ప్రవేశపెడుతున్నది. నేడు కూడా ప్రశ్నోత్తరాలను రద్దు చేసినట్లు అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్కయులు వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణ హేతుబద్ధీకరణ బిల్లుపై చర్చ ఉంటుందని ప్రకటించారు. బుధవారం (రేపు) శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇవాళ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలపై బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది.