రైతు భరోసా పైసలు రాలేదు సార్
గందరగోళంగా నగదు జమ.. బ్యాంకుల చుట్టు తిరుగుతున్న అన్నదాతలు

గతంలో బీఆర్‌ఎస్ హయాంలో రైతుబంధు పైసలు అందరికీ ఒకేసారి పడేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుభరోసా పథకం గందరగోళంగా మారుతున్నది. విడతలవారీగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రకటలకు భిన్నంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఉన్నాయి. మొదటి విడతగా రెండెకరాలలలోపు భూమి ఉన్న రైతులు, రెండో విడతగా రెండకరాలు ఉన్న వారి బ్యాంకుల్లో నగదు జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉన్నది. కొన్నిచోట్ల ఎకరం భూమి ఉన్న రైతులకు నగదు జమ కాలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. రెండు, మూడు ఎకరాలు ఉన్న రైతుల ఖాతాల్లో అరకొర నగదే జమ అయ్యిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎకరాలకు రూ. 6 వేలు, రెండు ఎకరాలున్న రైతులకు రూ. 12 వేలు ఖాతాల్లో జమకావాలి. కానీ కొంత మంది రైతులకు తక్కువ జమ అవుతున్నట్లు చెబుతున్నారు. ఇక కొత్తగా వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన రైతులు తమ పేర్లను నమోదు చేసుకున్నా.. వారికి ఇంకా నగదు జమ కాలేదు. పాత రైతుల ఖాతాల్లోనూ పూర్తిస్థాయిలో నగదు రాలేదంటున్నారు. వ్యవసాయ శాఖ పోర్టల్‌లో సమస్య ఉందని కొందరు అధికారులు అంటుంటే మరికొంతమంది అధికారులు మాత్రం మాకు ఏమీ తెలియడం లేదంటున్నారు. బ్యాంకర్ల దగ్గరికి వెళ్లి అడిగితే తమను ఆ విషక్ష్మీం అడగవద్దని రైతులకు తేల్చిచెబుతున్నారు. నిత్యం బ్యాంకులకు వచ్చి ఆరా తీసే వారికి నిరాశే ఎదురవుతున్నది. దీంతో రైతులు డబ్బులు పడుతాయో లేదోనని ఆందోళన చెందుతున్నారు.