బీసీ పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక ఇండస్ట్రియల్ పార్కు
బలహీనవర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తల కోసం బిక్కి ఏర్పాటు అభినందనీయమన్న మంత్రి
బలహీనవర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తల కోసం బిక్కి ఏర్పాటు అభినందనీయమని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. బ్యాక్‌వర్డ్ క్లాసెస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ఆధ్వర్యంలో టీహబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. మా ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్నది. అత్యుత్తమ ఎంఎస్‌ఎంఈ పాలసీ తీసుకొచ్చామన్నారు. విధానాలను ఆచరణలో పెట్టడమే పెద్ద సవాల్ అన్నారు. సమ్మిళిత అభివృద్ధి కోసమే మా ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. 50 శాతానికి పైగా ఉన్న బీసీ జనాభాకు అనుగుణంగా కార్యక్రమాలు ఉండాలనేది మా ప్రభుత్వ అభిమతం అన్నారు. కులాల వారీగా ఉపాధి అందాలనే ఉద్దేశంతోనే కులగణన చేస్తున్నామని, ఎన్ని సవాళ్లు ఎదురైనా అధిగమిస్తున్నామని చెప్పారు.
సవరణ అవసరమైతే చట్టాల మార్పులు చేయడానికి కేంద్రం సాయం తీసుకుంటామన్నారు. బిక్కి ప్రతిపాదనలకు అనుగుణంగా పారిశ్రామిక విధానాల్లో మార్పులు తీసుకొస్తామన్నారు. బ్యాంకుల నుంచి రుణాలు, ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి సమస్యలు రాకుండా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని తెలిపారు. వెనుకబడిన వర్గాల పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తాం. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ పరిశ్రమలు విస్తరించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వివరించారు.