Telugu Global
Telangana

మూసీ ప్రక్షాళన చేయాలన్నదే.. ప్రజా ప్రభుత్వ సంకల్పం

ఇది ఈ తరానికే కాదు.. భావి తరాలకు మేలు చేసే నిర్ణయమని సీఎం రేవంత్‌ సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌

మూసీ ప్రక్షాళన చేయాలన్నదే.. ప్రజా ప్రభుత్వ సంకల్పం
X

నదుల వెంట నాగరికత వర్ధిల్లాలి.. వాటిని కనుమరుగయ్యేలా చేస్తే మనిషి మనుగడే ప్రశ్నార్థకమవుతుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రజారోగ్యం, పటిష్ట ఆర్థిక పర్యావరణ కోణాల్లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చెందాల్సిన హైదరాబాద్‌కు మూసీ ఒక వరం కావాలి. కానీ శాపంగా మిగిలిపోకూడదని సీఎం సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. మూసీ ప్రక్షాళన చేయాలన్నదే.. ప్రజా ప్రభుత్వ సంకల్పం అని సీఎం పేర్కొన్నారు. ఇది ఈ తరానికే కాదు.. భావి తరాలకు మేలు చేసే నిర్ణయమని ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ నిర్ణయానికి అండగా నిలిచే ప్రతి వ్యక్తికి, వ్యవస్థకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

అయితే ఇటీవల 'మూసీ పునరుజ్జీవం-ప్రక్షాళన' పేరుతో అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తున్నది. ఈ నేపథ్యంలో పలువురి నుంచి సీఎం నిర్ణయం సరికాదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి సోషల్‌ మీడియాలో ఈ విధంగా స్పందించారు. అక్రమ కట్టడాలపై, ఫార్మా కంపెనీలపై పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ మాట్లాడిన మాటలు.. అధికారంలోకి వచ్చాక మాట్లాడుతున్న మాటలు చూసి విపక్షాలు, ప్రజలే కాదు నెటీజన్లు సెటైర్లు వేస్తున్నారు. మూసీ ప్రక్షాళనపైనే ఆయన చాలాసార్లు అనేక మాటలు మార్చారని ఎద్దేవా చేస్తున్నారు. మూసీ ప్రక్షాళనను ఎవరూ వ్యతిరేకించడం లేదు. ప్రతిపక్షాలు కూడా స్వాగతించాయి. కానీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లు కూల్చివేయడాన్ని తప్పుపడుతున్నాయి. కానీ అభివృద్ధికి సీఎం కొత్త భాష్యం చెబుతున్నారు. నిన్న వేములవాడలోనూ అభివృద్ధి జరగాలంటే ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందేనని, త్యాగం చేయాల్సిందేనని అన్నారు. మూసీ విషయంలోనూ ఆయన వితండవాదం చేస్తున్నారు. దీనిపై డీపీఆర్‌ లేకుండానే సీఎం అనాలోచితంగా పేదల ఇళ్లపై పడుతున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. ఒక ప్రణాళిక ప్రకారం చేయాల్సిన ప్రక్షాళనను రాత్రికి రాత్రే కూల్చివేసి చేస్తామనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

First Published:  21 Nov 2024 2:08 PM IST
Next Story