కేసీఆర్... నీ కుర్చీ గుంజుకున్నా... నిన్ను వదిలేది లేదు
హనుమకొండ లో ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
వరంగల్ నగరాన్ని హైదరాబాద్ కు దీటుగా అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్ అభివృద్ధి చెందితే ఉత్తర తెలంగాణ రూపురేఖలే మారుతాయన్నారు. మంగళవారం సాయంత్రం హనుమకొండ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాలకు సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మొదట ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు.ఈ కార్యక్రమం మా ఆడబిడ్డలకు అంకితమని పేర్కొన్నారు. ఈ అడబిడ్డలు మనసు నిండుగా నన్ను ఆశీర్వదించడం వల్లే ఇవాళ ఈ స్థానంలో ఉన్నానని స్పష్టం చేశారు.ఓరుగల్లు ఆడబిడ్డలకు మంత్రివర్గంలో ప్రముఖ స్థానం కల్పించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మహిళా అధికారి శాంతి కుమారి ఉన్నారని, ఇద్దరు మంత్రులుగా సురేఖ సీతక్క వ్యవహరిస్తున్నారు. ఇది ఆడబిడ్డల ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు.టాటా బిర్లాలను తలదన్నేల రాష్ట్రంలో ఆడబిడ్డలను వ్యాపారస్తులుగా ప్రభుత్వం తీర్చిదిద్దుతుందన్నారు. మీరు పూర్తిచేయలేదు (బీఆర్ఎస్ను ఉద్దేశించి) కాబట్టే.. మేం కాళోజీ కళాక్షేత్రంను పూర్తి చేశామని సీఎం తెలిపారు. వరంగల్ గడ్డపై రైతు డిక్లరేషన్ తో తెలంగాణలో కాంగ్రెస్ రూపురేఖలు మారిపోయాయని తెలిపారు. ఓరుగల్లు పోరాటంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. పనిచేసే వారి కాళ్లల్లో కట్టెలు పెట్టొద్దు.. వచ్చేసారి డిపాజిట్లు కూడా దక్కవని సీఎం జోస్యం చెప్పారు.
పది నెలల్లో తెలంగాణలో మహిళలు స్వేచ్ఛను పొందారు
చారిత్రాత్మక వరంగల్ నగరాన్ని హైదరాబాద్ కు ధీటుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతు న్నామని చెప్పారు.అందుకే వరంగల్ అభివృద్ధికి దాదాపు ఆరువేల కోట్లు కేటాయించించామని, ఇది చరిత్రలో నిలిచిపోయే నిర్ణయమన్నారు. వరగంల్ ను అభివృద్ధి చేసే వరకు నిద్రపోయేది లేదని, తెలంగాణ అభివృద్ధి కోసం 24 గంటలు పాటు కష్టపడుతానని పేర్కొన్నారు. పది నెలల్లో తెలంగాణలో మహిళలు స్వేచ్ఛను పొందారని, అదానీ, అంబానీ లకే పరిమితమైన సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు చేసే స్థాయికి మహిళలు ఎదుగుతు న్నారని తెలిపారు. పది నెలల్లో ఆడబిడ్డలను ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం పొందారని గుర్తు చేశారు. రూ.500లకే ఆడబిడ్డలు గ్యాస్ సిలిండర్ పొందారు. దేశంలో ఎక్కడైనా రూ.500.లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారా? అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన ప్రతీ పేద కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు.
ఇక కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లోనే ఉండు..లిక్కర్ నేనే పంపుతా
బీఆర్ఎస్పై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అలాంటి ప్రయత్నాలు ఎవరు చేసిన ఎవరినైనా కటకటాల వెనక్కి పంపిస్తామన్నారు. కిరాయి మనుషులతో అడ్డుకోవాలని చూస్తే సహించమన్నారు. మహిళలకు పెత్తనం ఇవ్వడం కేసీఆర్ కు ఇష్టం ఉండదన్నారు. ప్రజలు పదేళ్లు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని తాగుబోతుల సమూహంగా మార్చారని మండిపడ్డారు. ఈ 11 నెలల్లోనే ప్రజలు ఆ పదేళ్లు ఏం కోల్పోయారో తెలుసుకున్నారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఇన్నారని.. ఇక కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లోనే ఉండాలని సూచించారు. కావాలంటే రోజు ఫామ్ హౌజ్ కు లిక్కర్ తానే పంపిస్తానని సీఎం రేవంత్ అన్నారు.
కిషన్‌రెడ్డి.. సోనియా కాళ్లు కడిగి నెత్తి మీద పోసుకో
ఇన్నాళ్లు కిషన్రెడ్డిపైన కొంత గౌరవం ఉండేదని.. అది కూడా పోగొట్టుకున్నాడని మండిపడ్డారు. ఇక ఆయన తట్టా బుట్టా సర్దుకొని గుజరాత్‌కు వెళ్లిపోవాలని సూచించారు. గుజరాత్ గులాంను అని చెప్పుకునే కిషన్‌రెడ్డికి తెలంగాణలో ఉండే అర్హత లేదని విమర్శించారు. అసలు సోనియాగాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదన్నారు. ఒక్కసారి కాదు.. పదిసార్లు ఆమె కాళ్లు కడిగి నెత్తి మీద పోసుకున్నా తప్పులేదని కిషన్‌రెడ్డికి సీఎం సూచించారు. కాళోజీ నారాయణరావు బతికి ఉంటే కేసీఆర్, కిషన్‌రెడ్డిలను తెలంగాణ నుంచి తరిమివేసే వారని అన్నారు.
కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలవనివ్వను
ఇక రాష్ట్రంలో కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలవనివ్వనని అన్నారు. కేసీఆర్ కుట్రలన్నీ తమకు తెలుసన్నారు. ఇప్పటికే నీ కుర్చీ గుంజుకున్నా.. నిన్న వదిలేది లేదు అని కేసీఆర్‌కు హెచ్చరికలు జారీ చేశారు. బిల్లా-రంగా రండి.. అసెంబ్లీలో రుణమాఫీపై చర్చ పెడదామని కేటీఆర్, హరీశ్‌లకు సవాల్ విసిరారు. కేటీఆర్ రామారావు కాదు.. డ్రామారావు అని విమర్శించారు. ప్రజలు పదేళ్లు అధికారం ఇస్తే కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తిచేయలేకపోయారని ఎద్దేవా చేశారు.
మాట ఇచ్చాం.. నిలబెట్టుకున్నాం...
రాష్ట్రాన్ని కేసీఆర్ తాగుబోతుల రాష్ట్రంగా మార్చాలనుకున్నారని, కానీ ఇందిరమ్మ ప్రభుత్వంలో 10 నెలల్లో 50వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు.22లక్షల రైతు కుటుంబాలకు రూ.18వేల కోట్లు 25 రోజుల్లో రుణమాఫీ చేసిన ఘనత మా ప్రభుత్వానిదన్నారు. ఆనాడు భద్రకాళీ, సమ్మక్క సారక్క అమ్మవార్ల సాక్షిగా చెప్పానని, పంద్రాగస్టులోగా రుణమాఫీ చేసి తీరామని పేర్కొన్నారు. మిగిలిన రైతులందరికీ రుణాన్ని మాఫీ చేసే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని, ఆ మేరకు రుణమాఫీ చేసి తీరామని వెల్లడించారు. ఈ వేదికగా మాట ఇస్తున్నా... మిగిలిన అందరికీ రుణమాఫీ చేసే బాధ్యత మాది. అని హామీ ఇచ్చారు. తల తెగిపడ్డ ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు మాట ఇస్తే తల తెగిపడినా మడమ తిప్పని నైజం మాదిన్నారు.
సోనియమ్మ మా అమ్మ
సోనియమ్మ మా అమ్మ.. నాలుగుకోట్ల తెలంగాణ బిడ్డలకు ఆమె అమ్మ.. అని తెలిపారు. కాళోజీ కళా క్షేత్రాన్ని గొప్పగా నిర్మించామని పేర్కొన్నారు. వరంగల్ అభివృద్ధి కోసం మంత్రి సురేఖ, ఎమ్మెల్యేలు నిత్యం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. వరంగల్ నగరానికి గొప్ప చరిత్ర ఉందని, కాకతీయ రాజుల ఏలిన రాజ్యమని, వేయి స్తంభాల గుడి, రామప్ప ఆలయం ఇతర ప్రముఖమైన చరిత్ర ఉందని పేర్కొన్నారు. గొప్ప చరిత్ర ఉన్న వరంగల్ నగరాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. వరంగల్ అభివృద్ధి కోసం తాను నిద్రపోను.. అధికారులు, మంత్రులను సైతం నిద్ర పోనివ్వనని శపధం చేశారు. మమ్మునూరులో ఎయిర్ పోర్టు నిర్మాణంతో వరంగల్ దశ దిశ మారుతుందని పరిశ్రమలు అందుబాటులోకి వస్తాయని దీంతో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. మహారాష్ట్రలో ప్రతి 100 కిలోమీటర్లకు ఒక ఎయిర్పోర్ట్ ఉన్నదని, తెలంగాణలో మాత్రం ఒక హైదరాబాదులోనే ఉందని తెలిపారు. తెలంగాణలోని కొత్తగూడెం, ఆదిలాబాద్, రామగుండం ఇతర ప్రాంతాల్లో ఏర్పాట్ల నిర్మాణానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. స్వశక్తి సంఘాల అభివృద్ధి కోసం సోలార్ విద్యుత్ ప్లాంట్లు అప్పగిస్తామని పేర్కొన్నారు.
రికార్డుస్థాయిలో వరి పంట పండింది
రాష్ట్రంలో 66 లక్షల 1కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రైతులు పండించారు . ఈసారి తెలంగాణ రాష్ట్రంలో రికార్డుస్థాయిలో అత్యధికంగా వరి పంట పండిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఏ దేశంలో పండుగ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా పండని విధంగా 65 లక్షల ఎకరాల్లో కోటి 53 టన్నుల వరి ధాన్యం పండిందని ఇది తమ ప్రభుత్వ ఘనతని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి మహిళా సంఘాలకు చెక్కులను అందజేశారు.