Telugu Global
Telangana

'అమృత్‌' స్కీమ్‌లో అవినీతి జరుగుతుంటే కేంద్రం ఏం చేస్తున్నది?

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతి, కుంభకోణాల్లో కూరుకుపోయిందని ఆరోపించిన కేటీఆర్‌

అమృత్‌ స్కీమ్‌లో అవినీతి జరుగుతుంటే కేంద్రం ఏం చేస్తున్నది?
X

తెలంగాణలో అమృత్‌ పథకంలో అవినీతి జరుగుతుంటే కేంద్రం ఏం చేస్తున్నదని, ఎందుకు చర్యలు చేపట్టడం లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతి, కుంభకోణాల్లో కూరుకుపోయిందన్నారు. రాష్ట్రానికి కేటాయించిన రూ. 8,888 కోట్ల పనులపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. అమృత్‌ టెండర్ల అవినీతిపై అన్ని ఆధారాలున్నాయి. సీఎంగా ఉండి రేవంత్‌ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరామన్నారు. అర్హత లేకపోయినా శోధా కంపెనీకి టెండర్లు కట్టబెట్టారని చెప్పారు. రూ. 1,137 కోట్లకు సంబంధించిన పనులు ఆ కంపెనీకి ఇచ్చారన్నారు. 2021-22 లో శోధా కన్‌స్ట్రక్షన్‌ నికర ఆదాయం రూ. 2.2 కోట్లు మాత్రమేనని, అలాంటి కంపెనీకి రూ. 800 కోట్ల టెండర్లు ఎలా చేస్తుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టెండర్లు రద్దు చేయాలని కేంద్ర మంత్రిని కోరామన్నారు. అమృత్‌ పథకం టెండర్లకు సంబంధించి వెబ్‌సైట్‌లో వివరాలు లేవని, కేంద్రం స్కీమ్‌లో అవినీతి జరిగితే ప్రధాని ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో తప్పులు జరుగుతున్నాయని ఆధారాలతో వివరాలు ఇస్తున్నాం. లోక్‌సభ ఎన్నికల సమయంలో తెలంగాణలో ప్రచారానికి వచ్చిన ప్రధాని మోడీ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఏటీఎంలా మార్చిందని ఆరోపించారు. రాహుల్‌, రేవంత్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తున్నట్లు చెప్పారు. అదే నిజమైతే కేంద్రం విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అమృత్‌ పథకం కుంభకోణంపై విచారణ చేపట్టాలి.

తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్‌ పార్టీకి ఏటీఎంలా మారిందని ప్రధాని అన్న మాటలను కేటీఆర్‌ గుర్తు చేశారు. మంత్రి పొంగులేటి సంస్థలకు కూడా ఈ పథకం పనులు కట్టబెట్టారన్నారు. సొంతవర్గానికి పనులు కట్టబెట్టడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. అమృత్‌ పథకం కుంభకోణంపై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. మా ఆరోపణలను కేంద్రం సీరియస్‌గా తీసుకుంటుందని భావిస్తున్నామన్నారు. ఢిల్లీకి సీఎం రేవంత్‌ పలుమార్లు వెళ్లి వస్తున్నా కేంద్రం నుంచి రాష్ట్రానికి 26 పైసలు రాలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ నేతలు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారని మంత్రులు ప్రశ్నిస్తున్నారని ప్రధాన ప్రతిపక్షంగా కచ్చితంగా హస్తినకు వస్తామన్నారు. దేశ ప్రజల దృష్టికి కాంగ్రెస్‌ మోసాలను తీసుకువస్తామని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

రేవంత్‌ తన బావమరిదికి అమృతం పంచి.. కొడంగల్‌ ఫార్మాతో ప్రజలకు విషం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులు అప్పగిస్తే అధికార దుర్వినియోగం కాదా అని ప్రశ్నించారు. అల్లుని కోసం కొడంగల్‌ను బలిపెట్టే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే అక్కడ తిరుగుబాటు మొదలైందన్నారు. అస్మదీయులకు లబ్ధి చేకూర్చాలని ఝార్ఖండ్‌ సీఎంపై కేసు పెట్టారు. అదే కేసు సీఎం రేవంత్‌, మంత్రి పొంగులేటిపై ఎందుకు పెట్డడం లేదని ప్రశ్నించారు. సోనియాగాంధీ, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్‌ చవాన్‌ సహా చాలామంది పదవులు కోల్పోయారు. రేవంత్‌, పొంగులేటి పదవులు కూడా పోతాయని కేటీఆర్‌ తెలిపారు.

First Published:  12 Nov 2024 1:06 PM IST
Next Story