నేషనల్ హైవేపై బీసీ గురుకుల విద్యార్థుల ఆందోళన
బాట సింగారం వద్ద రోడ్డుపై బైఠాయించి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
రంగారెడ్డి జిల్లా బాట సింగారం వద్ద బీసీ గురుకుల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని రోడ్డుపై బైఠాయించారు. ఆహారం సరిగా ఉండటం లేదని.. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చదువు సరిగా లేదని, ఫుడ్ సరిగా లేదని విద్యార్థులు అంటున్నారు . మాకు న్యాయం కావాలని విద్యార్థులు నినదించారు. తమ సమస్యలు పరిష్కరించేవరకు నిరసన కొనసాగిస్తామన్నారు. విద్యార్థుల ఆందోళనతో రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలలను క్రమంగా నిర్వీర్యం చేస్తున్నదని ప్రధాన ప్రతిపక్షం ఆరోపిస్తున్నది. ఇప్పటికే కొన్ని గురుకుల పాఠశాలలో ఆహారం సరిగా ఫుడ్ పాయిజన్ అయి ఇద్దరు ముగ్గురు విద్యార్థులు ఆస్పత్రుల పాలై చికిత్స పొందుతూ చనిపోయారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు ఆయా పాఠశాలలకు వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించి విద్యార్థులకు న్యాయం చేస్తామన్నారు. కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా గురుకుల పాఠశాలల పరిస్థితి తయారైంది. తమ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు రోడ్లపైకి వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే బాట సింగారం వద్ద బీసీ గురుకుల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.