మన్నె క్రిశాంక్‌కు మెయిన్‌హార్డ్ సంస్థ లీగల్ నోటీసులు
మూసీ ప్రాజెక్టు కన్సల్టెన్సీ విషయంలో తమ సంస్థపై నిరాధార ఆరోపణలు చేశారన్నమెయిన్‌హార్డ్
బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు మెయిన్‌హార్డ్ సంస్థ లీగల్ నోటీసులు పంపింది. మూసీ ప్రాజెక్టు కన్సల్టెన్సీ విషయంలో నిరాధార ఆరోపణలు చేశారంటూ ఈ నిర్ణయం తీసుకున్నది. దురుద్దేశంతో తమ కంపెనీ ప్రతిష్ఠ దెబ్బతీసేలా ఆరోపణలు చేశారని మెయిన్‌హార్డ్స్ సంస్థ పేర్కొన్నది. 24 గంటల్లోపు క్రిశాంక్ తన వ్యాఖ్యలను వెనక్కితీసుకుని క్షమాపణలు చెప్పాలని.. అలాగే ఎక్స్‌లో పెట్టిన పోస్టులను తొలిగించాలని డిమాండ్ చేసింది. లేకపోతే సివిల్, క్రిమినల్ పరంగా న్యాయపరమైన చర్యలకు వెళ్తామని హెచ్చరించింది.
గ్లోబల్ బిడ్డింగ్ ద్వారానే తాము పనులు దక్కించుకున్నామని పేర్కొన్నది. సింగపూర్ ప్రభుత్వం తమపై ఎలాంటి కేసు నమోదు చేయలేదన్నది. పాకిస్థాన్ ప్రభుత్వం ఇచ్చిన రెడ్ వారెంట్‌ను రద్దు చేశారని పేర్కొన్నది. భారత విమానయాన సంస్థ తమపై ఎలాంటి నిషేధం విధించలేదని తెలిపింది. తమ సంస్థపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవడంతో పాటు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మెయిన్‌హార్డ్ క్రిశాంక్‌ను డిమాండ్ చేసింది.
తగ్గేదేలేదు: క్రిశాంక్
లీగల్ నోటీసులపై స్పందించిన మన్నె క్రిశాంక్ తాను పెట్టిన పోస్టులను తొలిగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నోటీసుల విషయమై కేటీఆర్‌తో చర్చించానని .. బీఆర్‌ఎస్ లీగల్ సెల్ దీనికి సమాధానం ఇస్తుందని క్రిశాంక్ పేర్కొన్నారు.