Telugu Global
Telangana

మూసీ సుందరీకరణ పేరుతో కుంభకోణం!

94 శాతం స్వచ్ఛమైన నీరు వెళ్తున్నప్పుడు మళ్లీ మూసీ శుద్ధి ఎందుకు ? మూసీ ప్రాజెక్టు రూ. లక్షన్నర కోట్లు ఖర్చుపెట్టే అవసరం ఉన్నదా? అని కేటీఆర్‌ ప్రశ్న

మూసీ సుందరీకరణ పేరుతో కుంభకోణం!
X

ఎస్టీపీ లు పూర్తయితే వంద శాతం హైదరాబాద్‌ మురుగునీటి రహిత నగరంగా మారుతుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులతో కలిసి ఫతేనగర్‌ ఎస్టీపీని పరిశీలించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఎస్టీపీ నిర్మాణంలో వేగం తగ్గింది. వీటి నిర్మాణంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపెడుతున్నదని విమర్శించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పెండింగ్‌ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు. కూకట్‌పల్లి నాలాను శుద్ధి చేయాలని కోరారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో హైదరాబాద్‌ను మురికి నీటి రహిత నగరంగా మార్చాలనే గొప్ప లక్ష్యంతో ఎస్టీపీ (మురుగు శుద్ధి కేంద్రం)లను ప్రారంభించామన్నారు. తమ హయాంలో మొత్తం 31 ఎస్టీపీల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. రూ. 3,866 కోట్లతో మురుగునీటి శుద్ధి కార్యక్రమం ప్రారంభించామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు మూసీ సుందరీకరణ అంటున్నదని ఎద్దేవా చేశారు. మూసీ సుందరీకరణ పేరుతో కుంభకోణం జరుగుతున్నదని ఆరోపించారు. మూసీ టెండర్లను పాకిస్థాన్‌ కంపెనీలకు కట్టబెడుతున్నారు. దీనికోసమే రూ. వేలు, లక్షల కోట్లు అంటే అందరికీ అనుమానం వస్తున్నదన్నారు. అసలు ఉద్దేశం మూసీ సుందరీకరణా? లేక ఇంకా ఏదైనా ఉన్నదా? అనేది ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయి. ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీరు మూసీ నదిలోకి వెళ్తుంది అనేది సీఎం తెలుసుకోవాలన్నారు. 94 శాతం స్వచ్ఛమైన నీరు వెళ్తున్నప్పుడు మళ్లీ మూసీ శుద్ధి ఎందుకు ? మూసీ ప్రాజెక్టు రూ. లక్షన్నర కోట్లు ఖర్చుపెట్టే అవసరం ఉన్నదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఉన్న మురికి నీరు అంతా శుద్ధి చేసిన తర్వాత మూసీ పేరుతో కొత్త నాటకమాడుతున్నారు.

సీఎం రేవంత్‌రెడ్డికి మేం చేస్తున్న విజ్ఞప్తి ఒక్కటేనని.. మీరు చేయాల్సిన పనులన్నీ గతంలో మేం చేసి ఉన్నాం. మీరు చేయాల్సింది ఏమిటంటే ప్రజలకు మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని కేటీఆర్‌ కోరారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లపై సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనేక అబద్ధాలు చెప్పారని విమర్శించారు. ఎస్టీపీల పెండింగ్‌ పనులను ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. హైడ్రా పేరుతో పెద్దలకు ఒక న్యాయం, పేదలకు మరో న్యాయం జరుగుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రాపై త్వరలో తమ పార్టీ ఎమ్మెల్యేలతో చర్చిస్తామన్నారు. మరోవైపు కూకట్‌పల్లి ఎస్టీపీని కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ నేతలు పరిశీలించనున్నారు.

First Published:  25 Sept 2024 5:48 AM GMT
Next Story