ఆ పసికందులు తల్లి ఒడికి చేరేదెప్పుడో..! - మంచిర్యాల ప్రభుత్వాస్పత్రిలో మగ బిడ్డ వివాదం
ఎవరు ఎవరి బిడ్డో తెలియాలంటే డీఎన్ఏ పరీక్ష ఒక్కటే మార్గమని నిర్ణయించారు. ఆ మేరకు డీఎన్ఏ పరీక్షకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరీక్ష చేసి.. ఫలితం రావడానికి కనీసం 15 రోజులు సమయం పడుతుంది.
తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల ప్రభుత్వాస్పత్రిలో పసిబిడ్డలు తారుమారైన ఘటన తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇంతకీ బిడ్డలను మార్చారా.. మార్చి ఉంటే వారెవరు.. ఎందుకు మార్చారు.. ఈ వివరాలన్నీ తేలాలంటే మరో 15 రోజులు ఆగాల్సిందే. అప్పటివరకు బిడ్డ పుట్టినా దూరంగా ఉండాల్సిన పరిస్థితి తల్లులకు, తల్లి ఒడిలో ఆడుకునే అవకాశం పిల్లలకు లేకుండా పోయింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలుసుకుందాం...
మంచిర్యాల జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో ఇద్దరు గర్భిణులకు మంగళవారం సిజేరియన్ చేశారు ఆస్పత్రి స్టాఫ్ నర్సులు. వారిలో మమతకు ప్రసవం అనంతరం మగ బిడ్డ పుట్టాడని చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికి కాదు కాదు.. ఆడబిడ్డే పుట్టిందని తెలిపారు. దీంతో షాకవ్వడం మమత కుటుంబ సభ్యుల వంతయింది. అదే సమయంలో సిజేరియన్ డెలివరీ అయిన ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన పావనికి ఈ మగ బిడ్డ పుట్టాడని చెప్పారు. బిడ్డలు పొరపాటున తారుమారయ్యారని స్టాఫ్ నర్సులు దీనిపై వివరణ ఇస్తున్నారు. దీనిపై వివాదం ముదిరి.. ఇరు కుటుంబాల వారు పోలీసులను ఆశ్రయించారు.
పోలీసు అధికారులు, ఆస్పత్రి అధికారులు ఎవరు ఎవరి బిడ్డో తెలియాలంటే డీఎన్ఏ పరీక్ష ఒక్కటే మార్గమని నిర్ణయించారు. ఆ మేరకు డీఎన్ఏ పరీక్షకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరీక్ష చేసి.. ఫలితం రావడానికి కనీసం 15 రోజులు సమయం పడుతుంది. అప్పటివరకు తల్లీ బిడ్డలు దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. పసిబిడ్డలిద్దరినీ ఆస్పత్రి సిబ్బంది పర్యవేక్షణలో ఇన్ బాక్స్‌లో ఉంచారు. పుట్టిన బిడ్డలు ఇద్దరూ తల్లి పాలకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. స్టాఫ్ నర్సుల నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందా? అసలేం జరిగిందనే విషయం తేలాల్సి ఉంది.