స్టేషన్ ఘన్‌పూర్‌లో కొత్త లొల్లి.. టికెట్ నాకే కావాలంటున్న నవ్య
రాజయ్యను తీవ్ర స్థాయిలో వ్యతిరేకించి, ఆయనపై సంచలన ఆరోపణలు చేసిన జానకీపురం సర్పంచ్ నవ్య మరోమారు తెరపైకి వచ్చారు. తనకు స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ టికెట్ కావాలని అడుగుతున్నారు.
స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ స్థానంలో బీఆర్ఎస్ టికెట్ సీనియర్ నేత కడియం శ్రీహరికే అని స్వయంగా కేసీఆరే ప్రకటించినా ఆశావహుల్లో ఇంకా ఆశ చావట్లేదు. చివరి నిమిషంలోనైనా టికెట్ తనకే దక్కుతుందని సిటింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మంచి నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు ఆ రేసులోకి కొత్తగా సర్పంచ్ నవ్య వచ్చి చేరారు. టికెట్ తనకివ్వాలంటూ దరఖాస్తు చేశారు.
కష్టపడి వేసిన కుప్పమీద ఎవరో వచ్చి కూర్చుంటే ఎలా?
స్టేషన్ ఘన్‌పూర్‌లో తను దశాబ్దాలుగా కష్టపడి నిర్మించుకున్న సామ్రాజ్యాన్ని వేరొకరికి ఎలా అప్పగిస్తానని రాజయ్య ప్రశ్నిస్తున్నారు. ఏడుపులు, పెడబొబ్బలతో పార్టీ నాయకత్వాన్ని నిలువనీయకుండా చేస్తున్న రాజయ్య ఎంతో కష్టపడి పంట పండించి, దాన్ని కుప్ప పోసుకున్నాక ఎవరో వచ్చి కూర్చుంటానంటే ఎలా ఒప్పుకుంటానంటూ పరోక్షంగా కడియం మీద కామెంట్ చేశారు.
రాజయ్యను వ్యతిరేకించిన నవ్య తెరపైకి
మరోవైపు రాజయ్యను తీవ్ర స్థాయిలో వ్యతిరేకించి, ఆయనపై సంచలన ఆరోపణలు చేసిన జానకీపురం సర్పంచ్ నవ్య మరోమారు తెరపైకి వచ్చారు. తనకు స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ టికెట్ కావాలని అడుగుతున్నారు. దీనికోసం ఆమె ఈ రోజు హైదరాబాద్‌లో పలువురు నాయకులను కలవడానికి భర్తతో కలిసి బయలుదేరినట్లు సమాచారం ఉంది. ఎన్నికల్లో పోటీ చేయడానిక అర్హతలు అక్కర్లేందంటున్న నవ్య అవసరమైతే వేరే పార్టీలోనుంచి అయినా పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. అసలే ఇద్దరు నేతల మధ్య టికెట్ పంచాయితీ, మధ్యలో నవ్య ట్విస్ట్ ఏంటని ఘన్‌పూర్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తలపట్టుకుంటున్నారట.
*