Telugu Global
Telangana

బీఆర్ఎస్-బీఎస్పీ పొత్తులో ట్విస్ట్

ఎన్డీఏ, ఇండియా కూటములకు సమాన దూరంలో ఉంటూనే.. తృతీయ ఫ్రంట్ కి సంబంధించి ఇతర ఏ పార్టీతోనూ తాము పొత్తులో లేమని స్పష్టం చేశారు మాయావతి.

బీఆర్ఎస్-బీఎస్పీ పొత్తులో ట్విస్ట్
X

సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్-బీఎస్పీ కలసి వెళ్లాలని కొన్నిరోజుల క్రితం నిర్ణయం తీసుకున్నాయి. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మధ్య చర్చలు కూడా జరిగాయి. ముఖ్యంగా నాగర్ కర్నూల్ లో బీఎస్పీకి మద్దతిస్తున్నట్టు బీఆర్ఎస్ నేతలు చెప్పారు. మిగతా చోట్ల బీఎస్పీ కేడర్, బీఆర్ఎస్ కి మద్దతుగా పనిచేస్తుంది. అయితే బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి తాజా ట్వీట్ పలు సందేహాలకు తావిస్తోంది. లోక్ సభ ఎన్నికలకోసం తాము ఎవరితో పొత్తు పెట్టుకోలేదని, ఒంటరిగానే పోటీ చేస్తున్నామని ఆమె ప్రకటించారు.


ఎన్డీఏ, ఇండియా కూటములకు సమాన దూరంలో ఉంటూనే.. తృతీయ ఫ్రంట్ కి సంబంధించి ఇతర ఏ పార్టీతోనూ తాము పొత్తులో లేమని స్పష్టం చేశారు మాయావతి. ఏ కూటమిలో అయినా బీఎస్పీ ఉందని మీడియా ప్రచారం చేస్తే అది వారి విశ్వసనీయతను తగ్గించుకున్నట్టేనని కుండబద్దలు కొట్టారు. దీంతో బీఆర్ఎస్-బీఎస్పీ పొత్తు సందిగ్ధంలో పడింది.

సమాచార లోపమేనా..?

దేశవ్యాప్తంగా బీఎస్పీ రాజకీయ ప్రయాణంపై మాయావతి ట్వీట్ వేశారు. ఎన్డీఏ, ఇండియా కూటముల్లో తాము లేమని చెప్పే ప్రయత్నం చేశారు, అదే సమయంలో థర్డ్ ఫ్రంట్ కోసం పనిచేసే కూటములకు కూడా తాము దూరమని చెప్పారు. కానీ తెలంగాణలో ప్రత్యేక పరిస్థితుల్లో బీఎస్పీ, బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంది. మాయావతి అనుమతితోనే తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కేసీఆర్ ని కలిశారని అంటున్నారు. అంటే మాయావతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే తెలంగాణలో బీఆర్ఎస్ తో బీఎస్పీకి పొత్తు కుదిరింది. మాయావతి తాజా ట్వీట్ పై తెలంగాణ బీఎస్పీ స్పందించాల్సి ఉంది.

First Published:  9 March 2024 3:36 PM GMT
Next Story