హైదరాబాద్‌లో నేటి నుంచి కొత్త రూల్స్..
ఇప్పటి వరకూ హెల్మెట్ లేకపోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, ఓవర్ స్పీడ్, నో పార్కింగ్ వంటి వాటికే జరిమానాలు విధించేవారు. ఇకపై మాత్రం ఉల్లంఘనలన్నిటికీ జరిమానాలు విధిస్తారు.
ఏడాదిలోపు హైదరాబాద్‌ని ఆక్రమణల రహిత నగరంగా మార్చేస్తామంటూ ప్రకటన చేసిన పోలీస్ అధికారులు.. ఆ పని మొదలుపెట్టారు. ఈ రోజు నుంచి హైదరాబాద్‌లో సవరించిన ట్రాఫిక్ రూల్స్ అమలులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు చూసీ చూడనట్టు వదిలేసినా.. ఇకపై మాత్రం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు అధికారులు. జరిమానాలతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. జరిమానాలు మా టార్గెట్ కాదు, ప్రజల్లో మార్పే మాకు ముఖ్యం అంటున్నారు.
చలానాలు ఇలా...
సిగ్నళ్ల వద్ద స్టాప్ లైన్ దాటితే రూ.100 జరిమానా
సిగ్నళ్ల వద్ద ఫ్రీ లెఫ్ట్ ను బ్లాక్ చేస్తే రూ.1,000
ఫుట్ పాత్ పై వాహనాలు నిలిపితే రూ.600
ఫోర్ వీలర్ రాంగ్ పార్కింగ్‌కి రూ.600
ఇప్పటి వరకూ హెల్మెట్ లేకపోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, ఓవర్ స్పీడ్, నోపార్కింగ్ వంటి వాటికే జరిమానాలు విధించేవారు. కొన్నిసార్లు వీటిని కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇకపై మాత్రం ఉల్లంఘనలన్నిటికీ జరిమానాలు విధిస్తారు.
సిగ్నల్స్ కీలకం..
ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఇకపై కచ్చితంగా రూల్స్ పాటించాలని చెబుతున్నారు పోలీసులు. సిగ్నల్స్ జంప్ చేసేవారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అంటున్నారు. ఏడాదిలోగా కచ్చితంగా మార్పు తెస్తామంటున్న పోలీసుల ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.