Telugu Global
Telangana

గుర్తులే కాదు పేర్లు కూడా.. బీఆర్ఎస్‌కు కొత్త టెన్షన్..!

ప్యాట నరేందర్‌ రెడ్డి ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా కొడంగ‌ల్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇది ఇప్పుడు సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న పట్నం నరేందర్‌ రెడ్డికి ఆందోళన కలిగించే అంశంగా మారింది.

గుర్తులే కాదు పేర్లు కూడా.. బీఆర్ఎస్‌కు కొత్త టెన్షన్..!
X

కారును పోలిన గుర్తులతో ఇప్పటికే టెన్షన్‌లో ఉన్న అధికార బీఆర్ఎస్‌కు ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చిపడింది. చాలా చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను పోలిన పేర్లతో స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉండటం గులాబీ పార్టీని ఆందోళనలో పడేసింది.

కొడంగల్‌లో పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్‌ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అదే పేరును పోలిన మరో అభ్యర్థి ఇక్కడ బరిలో ఉన్నారు. ప్యాట నరేందర్‌ రెడ్డి ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా కొడంగ‌ల్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇది ఇప్పుడు సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న పట్నం నరేందర్‌ రెడ్డికి ఆందోళన కలిగించే అంశంగా మారింది. కాగా, ఇది ప్రతిపక్ష పార్టీల ప్లాన్‌లో భాగమేనని అధికార పార్టీ అనుమానిస్తోంది. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్‌ అభ్యర్థులు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి. గుర్తుతో పాటు పేరు, ఫొటో కూడా చెక్‌ చేయాలని ఓటర్లకు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇక హుజూర్‌నగర్‌లో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తలపడుతున్నారు. ఇక్కడ అలయన్స్ ఆఫ్‌ డెమొక్రటిక్ రిఫార్మ్స్‌ పార్టీ తరఫున టి.సైదిరెడ్డి బరిలో ఉన్నారు. ఇక ఇదే తరహాలో ఖమ్మంలో పువ్వాడ అజయ్‌ కుమార్‌, తుమ్మల నాగేశ్వర రావు ప్రత్యర్థులుగా ఉన్నారు. ఇక్కడ అజయ్‌ పేరుతో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

ఇక మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ అభ్యర్థులు ఇద్దరు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ తరపున కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పోటీ చేస్తుండగా.. కల్లెం లక్ష్మారెడ్డి జనశంఖారావం పార్టీ నుంచి బరిలో ఉన్నారు. సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తుండగా.. గోలి సబితా యుగ తులసి పార్టీ అభ్యర్థిగా బ‌రిలో ఉన్నారు. మిర్యాలగూడ, నారాయణపేట నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లను పోలిన అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో డమ్మీ ఈవీఎంలను తీసుకెళ్లి మరీ అభ్యర్థులు ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

First Published:  21 Nov 2023 11:06 AM IST
Next Story