Telugu Global
Telangana

నేటి నుంచి తెలంగాణ రోడ్లపై తిరుగనున్న అత్యాధునిక టెక్నాలజీ సూపర్ లగ్జరీ బస్సులు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను టీఎస్ఆర్టీసీ కొత్త బస్సుల కోసం రూ.392 కోట్లను ఖర్చు చేసింది. మొత్తం 1016 బస్సుల కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసింది.

నేటి నుంచి తెలంగాణ రోడ్లపై తిరుగనున్న అత్యాధునిక టెక్నాలజీ సూపర్ లగ్జరీ బస్సులు
X

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మరింత ఆధునికత సంతరించుకోబోతోంది. ప్రైవేటు ఆపరేటర్ల నుంచి వస్తున్న పోటీని తట్టుకొని విస్తృతమైన సేవలు అందిస్తున్న టీఎస్ఆర్టీసీ.. ఇప్పుడు మరింత సౌకర్యవంతమైన ప్రయాణానికి ఏర్పాట్లు చేసింది. ప్రైవేటు ఆపరేటర్లు ఎన్నో అత్యాధునిక టెక్నాలజీతో నిండిన బస్సులను రోడ్లపై తిప్పుతూ ప్రయాణికులను తమ వైపు తిప్పుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆర్టీసీ కూడా పోటీని తట్టుకోవడానికి కొత్త బస్సులను తీసుకొని రావాలని సీఎం కేసీఆర్ సూచించారు. అంతే కాకుండా అందుకు అవసరమైన నిధులను కూడా ఆర్టీసీకి అందించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను టీఎస్ఆర్టీసీ కొత్త బస్సుల కోసం రూ.392 కోట్లను ఖర్చు చేసింది. మొత్తం 1016 బస్సుల కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసింది. తొలి విడతలో 630 సూపర్ లగ్జరీ, 130 డీలక్స్, 16 స్లీపర్ కోచ్‌లను అందుబాటులోకి రానున్నాయి. కాగా, వీటిలో కొన్ని సూపర్ లగ్జరీ బస్సుల బాడీ బిల్డింగ్ పూర్తయి ఇవ్వాల్టి నుంచి రోడ్డు ఎక్కనున్నాయి. చాలా బస్సులు ఇప్పటికే వాటికి కేటాయించిన డిపోలకు చేరుకున్నాయి. కాగా, హైదరాబాద్‌లోకి కొన్ని డిపోలకు కేటాయించిన బస్సులను మాత్రం శనివారం మధ్యాహ్నం 2.00 గంటలకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి, ట్రాన్స్‌పోర్ట్, ఆర్ అండ్ బీ డిపార్ట్‌మెంట్ సెక్రెటరీ శ్రీనివాసరాజు, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, రవాణా శాఖ కమిషనర్ జ్యోతీ బుద్దా ప్రకాశ్‌ పాల్గొననున్నారు.

కొత్త సూపర్ లగ్జరీ బస్సులలో అనేక అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. బస్సు ఎక్కడ ఉందో కనుక్కోవడానికి ట్రాకింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్‌లో కూడా బస్సు ఎక్కడ ఉందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక ప్రయాణికుల భద్రత కోసం పానిక్ బటన్‌ను ఏర్పాటు చేశారు. ప్రయాణంలో ఏవైనా ప్రమాదకరమైన పరిస్థితులు, ఇబ్బందులు ఎదురైతే ఈ పానిక్ బటన్ నొక్కవచ్చు. దీంతో క్షణాల్లో టీఎస్ఆర్టీసీ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందుతుంది. వెంటనే అధికారులు తగిన చర్యలు తీసుకుంటారు.

గతంలో పోలిస్తే ఈ కొత్త బస్సుల్లో ఏర్పాటు చేసిన రిక్లెయినింగ్ సీట్లు మరింత సౌకర్యవంతంగా ఉండబోతున్నాయి. బస్సులో ఎల్ఈడీ డిస్‌ప్లే కూడా సమాచారం కోసం అందుబాటులో ఉంటుంది. ఇక బస్సులో ఏర్పాటు చేసిన సీసీ కెమేరాల ద్వారా డ్రైవర్ లోపల ఏం జరుగుతుందో గమనించే వీలుంటుంది. రివర్స్ పార్కింగ్ కోసం కెమేరాలు, సెన్సార్లు ఏర్పాటు చేశారు. ఫైర్ డిటెక్ట్ చేయడానికి ప్రత్యేక అలారం సిస్టమ్ ఏర్పాటు చేశారు.బస్సులో మంటలు చెలరేగితే అలారం సిస్టం అప్రమత్తం చేస్తుంది. ఉష్ణోగ్రత పెరిగినా ఇది అలర్ట్ చేస్తుంది.

ప్రయాణికుల వినోదం కోసం ఎల్ఈడీ టీవీలను ఏర్పాటు చేశారు. అలాగే చార్జింగ్ సదుపాయం కూడా ఉన్నది. డ్రైవర్ వద్ద ఉండే మైక్ ద్వారా ప్రయాణికులకు ఎప్పటికప్పుడు అనౌన్స్‌మెంట్ చేసే అవకాశం ఉన్నది. వీటితో పాటు స్లీపర్ కోచ్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణలోని సుదూర ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఈ సర్వీసులు నడపనున్నారు. క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకొని ముందుగానే వీటిని అందుబాటులోకి తీసుకొని వచ్చారు. మిగిలిన బస్సులు వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోగా డిపోల్లోకి రానున్నాయి.





First Published:  24 Dec 2022 10:38 AM IST
Next Story