Telugu Global
Telangana

ముస్తాబవుతున్న కొత్త సచివాలయం.. ఐజీబీసీ గోల్డ్ సర్టిఫికెట్ పొందిన తొలి సెక్రటేరియట్

ఢిల్లీలో కేంద్రం నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్టా కంటే.. తెలంగాణ కొత్త సచివాలయం విశాలమైనది.

ముస్తాబవుతున్న కొత్త సచివాలయం.. ఐజీబీసీ గోల్డ్ సర్టిఫికెట్ పొందిన తొలి సెక్రటేరియట్
X

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. హైదరాబాద్ నగరంలోని పాత సచివాలయం స్థానంలో నిర్మించిన అత్యంత సువిశాలమైన భవనాన్ని ఈ నెల 30న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా.. ఎన్నో ప్రత్యేకతలు, ఆధునిక సౌకర్యాలతో ఈ సచివాలయాన్ని నిర్మించారు. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ఈ భవనానికి గోల్డెన్ సర్టిఫికెట్ అందించింది. ఇలాంటి సర్టిఫికెట్ పొందిన తొలి సెక్రటేరియట్‌గా రికార్డు సృష్టించినట్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.

కొత్త సెక్రటేరియట్‌ భవనంలో ఉన్న హాళ్లు, డోమ్‌లు, స్కైలాంజ్‌లు ఇతర ఏ సచివాలయాలకు లేవు. ఢిల్లీలో కేంద్రం నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్టా కంటే.. తెలంగాణ కొత్త సచివాలయం విశాలమైనది. ఇది తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీకగా, ప్రైడ్ ఆఫ్ తెలంగాణగా నిలుస్తుందని మంత్రి అభివర్ణించారు. సీఎం కేసీఆర్ ముందస్తు ప్రణాళికలు, నిరంతర పర్యవేక్షణ కారణంగా 20 నెలల్లోనే సచివాలయ నిర్మాణం పూర్తి చేసుకున్నామని చెప్పారు.

సచివాలయ నిర్మాణం 20 నెలల్లోనే పూర్తయ్యింది. పునాది రాయి వేసిన రోజే సీఎం కేసీఆర్.. మంత్రి నిరంజన్ రెడ్డి, అధికారులను పిలిచి అవసరమైన సామాగ్రిని ముందు కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అందుకే 20 నెలల్లోనే భవన నిర్మాణం, మౌళిక సదుపాయాల కల్పన పూర్తి చేసినట్లు మంత్రి చెప్పారు. వాస్తవానికి పనులు మొదలు పెట్టిన నాటి నుంచి ఏప్రిల్‌కు 26 నెలలు అవుతుంది. అయితే కోవిడ్ కారణంగా కార్మికులు ఊర్లకు వెళ్లిపోయారని.. వారిని తిరిగి రప్పించడానికి సమయం పట్టిందని.. అలా 6 నెలల వృధా అయినట్లు మంత్రి వెల్లడించారు.

కొత్త సెక్రటేరియట్ డోమ్‌లు, డోక్‌లకు చుట్టూ ఏర్పాటు చేసిన గ్లాస్, స్పూపాల ఏర్పాటుకు ఆరు నెలల సమయం పట్టింది. రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ మైన్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన రెడ్ శాండ్‌స్టోన్‌ను వాడినట్లు మంత్రి చెప్పారు. దీని కోసం రాజస్థాన్‌లోని ఒక మైన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే అదే మైన్ నుంచి పార్లమెంట్ భవన నిర్మాణానికి కూడా రెండ్ శాండ్ స్టోన్ కొనుగోలు చేశారు. దీంతో అప్పటికప్పుడు మరో మైన్ నుంచి స్టోన్ కొనుగోలు చేశారు. దాదాపు 3500 క్యూబిక్ మీటర్ల రెడ్ సాండ్ స్టోన్‌ను రాజస్థాన్ నుంచి 1000 లారీల్లో ఇక్కడకు తెప్పించారు.

ఇవీ ప్రత్యేకతలు..

- సచివాలయం విద్యుత్ వాడకాన్ని తగ్గించేందుకు పార్కింగ్ ఏరియాలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. 28 ఎకరాల స్థలంలో కేవలం రెండున్నర ఎకరాల స్థలంలో మాత్రమే భవనాన్ని నిర్మించారు. మిగిలన ప్రాంతాన్ని పచ్చదనం, పార్కింగ్, రోడ్ల కోసం ఉపయోగిస్తున్నారు.

- సచివాలయంలో పని చేసే వారి తాగు నీటి అవసరాల కోసం 120 కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన సంపు, ఇతర అవసరాల కోసం 180 కిలోలీటర్ల సంపులు రెండు, వర్షపు నీటిని నిల్వ చేసేందుకు 200 కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన మరో సంపు ఏర్పాటు చేశారు. ఇక ఏసీ ప్లాంటుకు అవసరమయ్యే నీళ్లు, గార్డెనింగ్ కోసం, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు నీటి కొరత లేకుండా ఏర్పాట్లు చేశారు.

- సచివాలయంలో రిసెప్షన్ హాలు, మీడియా హాలు, రెండు బ్యాంకులు, రెండు ఏటీఎంలు, బస్ కౌంటర్, రైల్వే కౌంటర్, క్యాంటీన్, అసోసియేషన్ బిల్డింగ్, డిస్పెన్సరీ, మసీదు, దేవాలయం, చర్చి ఉన్నాయి.

- సెక్రటేరియట్ రక్షణ కోసం 300 సీసీ కెమేరాలు ఏర్పాటు చేశారు. రెండు షిఫ్టుల్లో పని చేసేందుకు 300 మంది సెక్యూరిటీని నియమించారు. సీపీ కెమేరాలను అనుసంధానిస్తూ ఐదో అంతస్తులో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

- 10 లక్షల చదరపు అడుగుల విశాలమైన ఈ భవనంలోకి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా డిజైన్ చేశారు. గదుల ఎత్తు 14 అడుగులు ఉంటుంది. ముందు, వెనుక ఉన్న పోర్టికోల ఎత్తు 28 అడుగులు.

- సచివాలయం.. ఢిల్లీలోని కుతుబ్‌మినార్ కంటే ఎత్తుగా ఉంటుంది. ఆరో అంతస్తులో 28 అడుగుల ఎత్తైన రెండు హాళ్లు నిర్మించారు. ప్రత్యేక అతిథులు, విదేశీ ప్రతినిధులు వచ్చిన సమయంలో విందుల కోసం వీటిని ఉపయోగిస్తారు.

- సచివాలయానికి ఇరువైపులా 24 లిఫ్టులు ఉన్నాయి. వీటిలో 8 లిఫ్టులు నేరుగా స్కై లాంజ్ వరకు వెళ్తాయి.

- లోయర్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా సచివాలయం ఆరు ఫ్లోర్లు ఉంటుంది. ప్రధాన డోమ్‌లు ఉన్న చోట భవనం 11 అంతస్తులు ఉంటుంది. రూ.617 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ సచివాలయం నిర్వహణకు నెలకు రూ.1 కోటి అవుతుంది.

First Published:  28 April 2023 6:54 AM IST
Next Story