జనసేనకు కొత్త చిక్కులు.!
జాతీయ జనసేన కేవలం కూకట్‌పల్లి స్థానంలో మాత్రమే పోటీ చేస్తోంది. ఇక్కడ సెటిలర్లు ఎక్కువగా ఉండటంతో ఈ స్థానంపై జనసేన ఆశలు పెట్టుకుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేస్తున్న జనసేనకు కొత్త సమస్య వచ్చింది. జాతీయ జనసేన పేరుతో మరో పార్టీ బరిలో ఉండటం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. జాతీయ జనసేన పార్టీ గుర్తు సైతం జనసేన గాజు గ్లాసును పోలి ఉండటం ఇంకో సమస్య. అచ్చం గ్లాసును పోలిన బకెట్ గుర్తుతో జాతీయ జనసేన తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. పేరు, గుర్తు దాదాపు ఒకే రకంగా ఉండటంతో ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశాలున్నాయని జనసేన నేతలు ఆందోళన చెందుతున్నారు.
అయితే జాతీయ జనసేన కేవలం కూకట్‌పల్లి స్థానంలో మాత్రమే పోటీ చేస్తోంది. ఇక్కడ సెటిలర్లు ఎక్కువగా ఉండటంతో ఈ స్థానంపై జనసేన ఆశలు పెట్టుకుంది. జాతీయ జనసేన రూపంలో జనసేనకు షాక్ తగిలినట్లయింది. కాగా, జాతీయ జనసేన పోటీ వెనుక బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ ఉన్నాయని జనసేన నేతలు అనుమానిస్తున్నారు.
ఇక పొత్తులో భాగంగా బీజేపీ 111 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. జనసేనకు 8 స్థానాలు కేటాయించింది. కూకట్‌పల్లి, తాండూరు, కోదాడ, నాగర్‌కర్నూలు, ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వారావు పేట స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీలో ఉన్నారు.