Telugu Global
Telangana

ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి కొత్త అధ్యక్షులు.. తెలంగాణకు కిషన్ రెడ్డి.. ఏపీకి పురందేశ్వరి

తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు కూడా కొత్త అధ్యక్షులను నియమించింది.

ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి కొత్త అధ్యక్షులు.. తెలంగాణకు కిషన్ రెడ్డి.. ఏపీకి పురందేశ్వరి
X

ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి కొత్త అధ్యక్షులు.. తెలంగాణకు కిషన్ రెడ్డి.. ఏపీకి పురందేశ్వరి

పలు రాష్ట్రాల్లో ఎన్నికలు, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఐదు రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షుల్లో మార్పు చేసింది. ఎన్నికల వేళ భారీగా మార్పులు చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. గత కొన్ని రోజులుగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు ఉంటుందని వార్తలు వచ్చాయి. రాష్ట్ర, జాతీయ నాయకత్వం మధ్య సమన్వయం చేయడంలో.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంలో బండి సంజయ్ విఫలమయ్యారని బీజేపీ అధిష్టానం భావించింది. ఈ క్రమంలోనే ఆయన స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది.

బీజేపీలో సుదీర్ఘ కాలం పాటు అనేక పదవులు నిర్వహించిన అనుభవం ఉండటం, ప్రజల్లో మంచి పేరు ఉండటంతోనే కిషన్ రెడ్డిని అధ్యక్ష పదవిలో నియమించినట్లు తెలుస్తున్నది. అంతకు ముందు జేపీ నడ్డాకు బండి సంజయ్ తన రాజీనామాను సమర్పించారు. తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు కూడా కొత్త అధ్యక్షులను నియమించింది.

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి, ఏపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి, జార్ఖండ్ అధ్యక్షుడిగా బాబూలాల్ మరండి, పంజాబ్ అధ్యక్షుడిగా సునిల్ జాఖర్, రాజస్థాన్ అధ్యక్షుడిగా గజేంద్ర సింగ్ షెకావత్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాలు వెంటనే అమలులోకి వస్తాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇక తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్‌ను నియమించింది. ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో చోటు కల్పించింది.

First Published:  4 July 2023 3:40 PM IST
Next Story