Telugu Global
Telangana

జల్లెడ పట్టినా దొరకట్లేదు.. మావోయిస్టులను పట్టుకోవడానికి తెలంగాణ పోలీసుల నయా ప్లాన్

వరంగల్ అటవీ ప్రాంతంలో మావోయిస్టు దళాలు సంచరిస్తున్నట్లు సమాచారం అందింది. పోలీసులు గాలించినా వారి ఆచూకీ లభించలేదు. దీంతో మావోయిస్టుల ఆచూకీ తెలిపిన వారికి భారీ మొత్తంలో నగదు బహుమతులు ఇస్తామంటూ పోలీసులు పోస్టర్లు విడుదల చేశారు.

జల్లెడ పట్టినా దొరకట్లేదు.. మావోయిస్టులను పట్టుకోవడానికి తెలంగాణ పోలీసుల నయా ప్లాన్
X

తెలంగాణ ప్రాంతంలో ఒకప్పుడు మావోయిస్టుల (అప్పటి పీపుల్స్‌వార్) ఉనికి బలంగానే ఉండేది. కానీ, గత కొన్నేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధిత మావోయిస్టు పార్టీపై ఉక్కుపాదం మోపడంతో ఈ ప్రాంతం నుంచి సేఫ్ జోన్‌కు తరలి వెళ్లిపోయారు. మహారాష్ట్ర, ఛ‌త్తీస్‌గడ్ ప్రాంతాల్లో మావోయిస్టులు షెల్టర్ జోన్స్ ఏర్పాటు చేసుకొని.. అక్కడి నుంచి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. కాగా, ఇటీవల కాలంలో సరిహద్దు జిల్లాలైన అదిలాబాద్, కరీంనగర్, ములుగు ప్రాంతాల్లో తమ కార్యకలాపాలు తిరిగి యాక్టివేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కొన్ని వారాల క్రితం ఒక దళం మహారాష్ట్ర నుంచి అదిలాబాద్ జిల్లాలోకి వచ్చిందనే సమాచారంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆ ప్రాంతంలోని పల్లెలను స్థానిక పోలీసుల సహాయంతో గ్రేహౌండ్స్ జల్లెడ పట్టాయి. కానీ ఒక్క మావోయిస్టు జాడ కూడా దొరకలేదు.

కేవలం అదిలాబాద్ ప్రాంతంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఇప్పటికీ ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు స్థానిక సీఐ, డీఎస్పీల సాయంతోనే గ్రేహౌండ్స్ గాలింపు చర్యలు చేపట్టాయి. అయినా ఫలితం లేకపోవడంతో స్వయంగా ఆయా జిల్లాల ఎస్పీలు రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. మావోయిస్టులపై ఇప్పటికీ తెలంగాణ ఆదివాసీ ప్రాంతాల్లో సాఫ్ట్ కార్నర్ ఉంది. అంత త్వరగా అక్కడి ప్రజలు మావోయిస్టుల ఆచూకీ చెప్పరు. అందుకే మావోయిస్టులు కూడా ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన, ఆదివాసీల సాయం తీసుకుంటున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో వారిని బెదిరించో, బతిమిలాడో మావోయిస్టుల ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

తాజాగా వరంగల్ అటవీ ప్రాంతంలో మావోయిస్టు దళాలు సంచరిస్తున్నట్లు సమాచారం అందింది. పోలీసులు గాలించినా వారి ఆచూకీ లభించలేదు. దీంతో మావోయిస్టుల ఆచూకీ తెలిపిన వారికి భారీ మొత్తంలో నగదు బహుమతులు ఇస్తామంటూ పోలీసులు పోస్టర్లు విడుదల చేశారు. నిషేధిత మావోయిస్టులకు అసలు సహకరించ వద్దని, పోలీసులకు సమాచారం ఇస్తే బహుమతులు ఇస్తామని చెప్తున్నారు. మావోయిస్టుల కారణంగా ఈ ప్రాంతాల్లో అభివృద్ధి జరగడం లేదంటూ పోలీసులు ప్రచారం చేస్తున్నారు. కీలకమైన మావోయిస్టు నేతల ఫొటోలను ముద్రించి వరంగల్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ప్రచారం చేస్తున్నారు. ఆచూకీ తెలిపితే రూ. 5 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు నగదు బహుమతి ఇస్తామని చెప్తున్నారు.

ములుగు ఏజెన్సీలో తిరుగుతున్న మావోయిస్టుల ముఖ్య నాయకుల ఫొటోలు ప్రచురించారు. చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ మల్లన్న, కంకణాల రాజిరెడ్డి అలియాస్ ధర్మన్న, ముచకి ఉంగల్ అలియాస్ రఘు అలియాస్ సుధాకర్, కొవ్వాసి రాము, కుర్సు మంగు అలాయాస్ భద్ర అలియాస్ పాపన్న, మడకం సన్నల్ అలియాస్ మంగ్తూ ఫొటోలు ఈ పోస్టర్లలో ఉన్నాయి. మావోయిస్టుల ఆచూకీ తెలిపితే బహుమానం ఇస్తాం. వారికి సహకరిస్తే మాత్రం చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. మరి పోలీసుల పోస్టర్లు ఏ మేరకు మావోయిస్టుల ఆచూకీ తెలుపుతాయో వేచి చూడాలి.

First Published:  8 Sept 2022 9:22 AM IST
Next Story