Telugu Global
Telangana

నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవ వివాదం.. సంచలన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ గవర్నర్

ఈ వివాదంపై తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ స్పందించారు. పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని తెలంగాణ నూతన సచివాలయ అంశంతో ముడిపెడుతూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.

నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవ వివాదం.. సంచలన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ గవర్నర్
X

ఈనెల 28వ తేదీన ఢిల్లీలో నూతన పార్లమెంటు భవనం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ భవనాన్ని ప్రధానమంత్రి మోడీ ప్రారంభించనుండగా.. దీనిని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్రపతి చేతుల మీదుగా నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభిస్తేనే కార్యక్రమానికి హాజరవుతామని లేదంటే హాజ‌రుకామని.. దేశంలోని 19 ప్రధాన పార్టీలు ప్రకటించాయి.

నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ వివాదం సుప్రీంకోర్టుకు కూడా చేరింది. కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో న్యాయవాది జయ సుకిన్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.

ఈ నేపథ్యంలో ఈ వివాదంపై తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ స్పందించారు. పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని తెలంగాణ నూతన సచివాలయ అంశంతో ముడిపెడుతూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సచివాలయాన్ని అద్భుతంగా కట్టారని.. అయితే ఈ భవన ప్రారంభోత్సవానికి కనీసం తనను ఆహ్వానించలేదన్నారు. ఎవరూ కూడా ఆహ్వాన పత్రిక కూడా ఇవ్వలేదన్నారు. కొత్త పార్లమెంటును రాష్ట్రపతి ప్రారంభించాలని విపక్షాలు కోరుతున్నాయని.. అయితే రాష్ట్రపతికి రాజకీయాలతో సంబంధం ఉండదనే అంశాన్ని గుర్తించాలని తమిళి సై ప్రతిపక్ష పార్టీలకు సూచించారు.

కాగా, తెలంగాణ గవర్నర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తెలంగాణ సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి గవర్నర్ తమిళిసైని ఆహ్వానించకపోవడంపై అప్పట్లో ప్రతిపక్షాలు నోరు మెదపలేదు. అయితే ఇప్పుడు పార్లమెంటును ప్రధాని మోడీ ప్రారంభిస్తుంటే ప్రతిపక్షాలు ఎందుకంత వ్యతిరేకత తెలుపుతున్నాయని తమిళి సై పరోక్షంగా ప్రతిపక్షాలను విమర్శించారు.

First Published:  25 May 2023 7:47 PM IST
Next Story