చార్మినార్ కి మెట్రో రెడీ.. నెలరోజుల్లో భూసేకరణకు ఎల్ అండ్ టి
ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు 5.5 కిలోమీటర్ల పొడవున మెట్రో రైలు మార్గాన్ని నిర్మించాల్సి ఉంది. ఈ మార్గంలో మొత్తం 5 రైల్వే స్టేషన్లు వస్తాయని చెప్పారు మెట్రో రైల్ ఎండీ.
పాతబస్తీ మెట్రో రైలు ప్రాజెక్ట్ పై ఇటీవలే మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు. దానికి కొనసాగింపుగా ఇప్పుడు మెట్రో రైల్ సంస్థ భూ సేకరణకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించింది. నెలరోజుల్లో భూసేకరణకు నోటీసులు జారీ చేస్తామని తెలిపారు మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి. పాతబస్తీ మెట్రో రైల్ మార్గం పూర్తయితే ఎంజీబీఎస్ నుంచి నేరుగా ఫలక్ నుమా వరకు మెట్రో ప్రయాణం సాధ్యమవుతుంది.
5.5 కిలోమీటర్లు.. 5 స్టేషన్లు
ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు 5.5 కిలోమీటర్ల పొడవున మెట్రో రైలు మార్గాన్ని నిర్మించాల్సి ఉంది. ఈ మార్గంలో మొత్తం 5 రైల్వే స్టేషన్లు వస్తాయని చెప్పారు మెట్రో రైల్ ఎండీ. గతంలో భూసేకరణ విషయంలో సమస్యలు తలెత్తాయని ఆయన గుర్తు చేశారు. త్వరలోనే వాటిని పరిష్కరిస్తామన్నారు. మెట్రో రైలు మార్గంలో 103 మతపరమైన నిర్మాణాలు ఉన్నాయి. వీటికి ప్రత్యామ్నాయాలు చూపిస్తూ మెట్రో ముందుకు సాగుతుంది.
మెట్రో రైలు తొలివిడతలో 69.2 కిలోమీటర్ల పొడవైన మార్గాన్ని నిర్మించారు. వివిధ అభ్యంతరాల నేపథ్యంలో పాతబస్తీ మార్గాన్ని పక్కనపెట్టారు. ఇప్పుడు ఆ 5.5 కిలోమీటర్లు కూడా నిర్మిస్తారు. పాతబస్తీ మార్గంతోపాటు అక్కడక్కడా ఆగిపోయిన 2.7 కిలోమీటర్ల మార్గాన్ని కూడా ఇప్పుడే పూర్తి చేస్తారు. దీంతో మెట్రో విస్తీర్ణంమరింత పెరుగుతుంది.