Telugu Global
Telangana

జూన్ నుంచి కొత్త హైదరాబాద్‌.. రేవంత్ "మెగా గ్రేటర్‌" వివరాలివే..

రాజధాని పరిధిలో ప్రస్తుతం 5 మాస్టర్‌ప్లాన్లు ఉండటంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఐదింటిని విలీనం చేసి.. వచ్చే 30 ఏళ్లు అమలులో ఉండే విధంగా ఒకే మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాలని సీఎం ఆదేశించారు.

జూన్ నుంచి కొత్త హైదరాబాద్‌.. రేవంత్ మెగా గ్రేటర్‌ వివరాలివే..
X

హైదరాబాద్‌కు మణిహారమైన ఔటర్‌ రింగ్‌రోడ్డు వరకు GHMCని విస్తరించడానికి రేవంత్ సర్కారు కసరత్తు కొనసాగుతోంది. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లా పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను కలిపి మెగా గ్రేటర్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా జూన్‌ నాటికి ప్రణాళికను పూర్తిచేయనున్నారు. అనంతరం సీఎంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు.

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సమయం ఉండటంతో ప్రాథమిక నివేదికను ఎన్నికల కోడ్‌ తరువాత సీఎం ముందుంచాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం బల్దియా పరిధిలో 150 డివిజన్లు ఉన్నాయి. దాదాపు 74 లక్షలమంది ఓటర్లు ఉన్నారు. జనాభా కోటి వరకు ఉంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను బల్దియాలో విలీనం చేస్తే జనాభా మరో 60 లక్షల వరకు పెరుగుతుంది. అదనంగా మరో 50 నుంచి 60 డివిజన్ల వరకు పెరుగుతాయని అధికారుల అంచనా. అప్పుడు డివిజన్ల సంఖ్య 210 వరకు పెరిగే అవకాశం ఉంది. మెగా గ్రేటర్‌ పెద్దగా ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి భావించి.. దీన్ని రెండుగా చేయమని ఆదేశించగా అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

2007లో 12 మున్సిపాల్టీలు, 8 గ్రామపంచాయతీలతో GHMC ఏర్పాటైంది. దాదాపు కోటి జనాభా ఉండగా 150 డివిజన్లు ఏర్పాటు చేశారు. ఈ 150 డివిజన్లలో బల్దియాకు వచ్చిన నిధులతో బాగానే అభివృద్ధి జరిగింది. కానీ హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న 7 కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీలు మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. ఈ నేపథ్యంలోనే గ్రేటర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారనే చర్చ జరుగుతోంది. రాజధాని పరిధిలో ప్రస్తుతం 5 మాస్టర్‌ప్లాన్లు ఉండటంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఐదింటిని విలీనం చేసి.. వచ్చే 30 ఏళ్లు అమలులో ఉండే విధంగా ఒకే మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాలని సీఎం ఆదేశించారు. దీనికి అనుగుణంగానే అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇదే సమయంలో గ్రేటర్‌ను కూడా విస్తరించాలని సీఎం భావించారు. ORR లోపల ఉన్న సంస్థలన్నింటిని కలిపి మెగా గ్రేటర్‌ను ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. 3 నెలల్లో దీనిపై ప్రణాళిక రూపొందించాలని సీఎం ఆదేశించడంతో అధికారులు ఆ పనిలో ఉన్నారు.

First Published:  2 April 2024 11:06 AM IST
Next Story