జనవరి 9న నూతన ఇంధన విధాన ప్రకటన
దేశవ్యాప్తంగా ఎనర్జీ పాలసీతో పాటు రాష్ట్రంలో రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తికి అవసరమైన అంశాలను అధ్యయనం చేసి నూతన విధానాన్ని రూపొందించినట్లు తెలిపిన భట్టి
పెట్టుబడులు ఆకర్షించే విధంగా జనవరి 9న నూతన ఇంధన విధానాన్ని ప్రకటించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఎనర్జీ పాలసీతో పాటు రాష్ట్రంలో రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తికి అవసరమైన అంశాలను అధ్యయనం చేసి నూతన విధానాన్ని రూపొందించినట్లు భట్టి తెలిపారు. తెలంగాణ జెన్‌కోలో అసిస్టెంట్ ఇంజినీర్, ఇతర పోస్టులకు ఎంపికైన 315 మంది అభ్యర్థులకు భట్టి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడారు.
రాష్ట్రానికి 2030 నాటికి అవసరమైన గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 22,448 మెగావాట్ల ఉత్పత్తికి ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు వెళ్తున్నది. విద్యుత్ సరఫరా వ్యవస్థనూ విస్తరిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ప్రణాళిక రూపొందించారు. రామగుండంలో జెన్ కో, సింగరేణి సంయుక్తకంగా థర్మల్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర జీఎస్‌డీపీ వృద్ధిలో ఇంధన శాఖ ప్రధాన పాత్ర పోషిస్తున్నది. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కచ్చితమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నది. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశాం. ఎలాంటి లోటుపాట్లు లేకుండా పారదర్శకంగా, పకడ్బందీగా నియామక ప్రక్రియ నిర్వహించి ఇప్పటికే 56 వేల మందికి నియామక పత్రాలు అందించామని భట్టి వివరించారు.