Telugu Global
Telangana

తెలుగు రాష్ట్రాలకు కొత్త సీజేలు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఏపీ సహా.. 7 రాష్ట్రాల హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్‌లు రాబోతున్నారు.

తెలుగు రాష్ట్రాలకు కొత్త సీజేలు
X

ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్తగా ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం సిఫార్సులు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు మొత్తం 7 రాష్ట్రాల్లో హైకోర్టుల చీఫ్ జస్టిస్ ల బదిలీ జరిగింది. కొలీజియం తాజా సిఫార్సులతో త్వరలోనే కొత్త నియామకాలు జరగబోతున్నాయి.

ఏపీ హైకోర్టుకి చీఫ్ జస్టిస్‌ గా ధీరజ్ సింగ్ ఠాకూర్‌ ని కొలీజియం సిఫార్సు చేసింది. జమ్మూకాశ్మీర్‌ కు చెందిన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ 2013లో అక్కడి హైకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన 2022 జూన్‌ నుంచి బాంబే హైకోర్టు జడ్జిగా ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ ను మణిపూర్‌ హైకోర్టు సీజేగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. అది కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌ లో ఉండగా ఆ నియామకాన్ని తాజాగా కొలీజియం రద్దు చేసింది. ఆయన్ను ఏపీ హైకోర్టు సీజేగా సిఫార్సు చేసింది. ఏపీ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్‌ పీకే మిశ్రా మే నెలలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి సీజే స్థానం ఖాళీగా ఉంది. ఇప్పుడు ఏపీ సీజేగా ధీరజ్ సింగ్ ఠాకూర్ వస్తున్నారు.

తెలంగాణకు జస్టిస్ అలోక్ అరదే..

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్ ను సుప్రీంకోర్టు జడ్జిగా కొలీజియం బదిలీ చేసింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అలోక్ అరదేకు అవకాశమిచ్చింది. మధ్యప్రదేశ్‌కు చెందిన జస్టిస్ అలోక్ అరదే.. 2009లో అక్కడి హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2018 నవంబర్ నుంచి కర్నాటక హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన్ను తెలంగాణ హైకోర్టు సీజేగా బదిలీ చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఏపీ సహా.. 7 రాష్ట్రాల హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్‌లు రాబోతున్నారు.

First Published:  6 July 2023 7:39 AM GMT
Next Story