Telugu Global
Telangana

రాజగోపాల్ తో పోలిస్తే కేఏ పాల్ బెటర్..

ప్రజల్లోకి వెళ్లే విషయంలో రాజగోపాల్ రెడ్డి కంటే కేఏ పాల్ బెటర్ అని అంటున్నారు నెటిజన్లు. రాజగోపాల్ రెడ్డి వాహనంపై నుంచి ప్రసంగించడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు, కేఏ పాల్ జనంలోకి వెళ్లి కాస్త కామెడీ చేస్తున్నారు.

రాజగోపాల్ తో పోలిస్తే కేఏ పాల్ బెటర్..
X

మునుగోడు ఉప ఎన్నికల్లో అభ్యర్థులు ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఊరూరా తిరుగుతున్నారు, ప్రతి మండలంలో సభ పెడుతున్నారు, నేరుగా జనాల్ని కలిసేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రజలనుంచి ఎక్కడా వ్యతిరేకత ఎదురు కావడంలేదు. టీఆర్ఎస్ సభలు, సమావేశాలు, ప్రచారానికి ప్రజలు స్వచ్ఛందంగా కదలి వస్తున్నారు. కాంగ్రెస్ కి ఆ స్థాయిలో జనాలు రాకపోయినా.. సంప్రదాయ ఓటర్లు మాత్రం స్రవంతి వెంట నడుస్తున్నారు. కానీ రోజగోపాల్ రెడ్డి పరిస్థితి దారుణంగా ఉంది. వెళ్లిన ప్రతిచోటా ఆయనకు వ్యతిరేకత‌ వ్యక్తమవుతోంది. మునుగోడులో ఆయన్ని ప్రజలు తరుముకున్నారు, ఆయన భార్యని కూడా ప్రచారానికి రాకుండా స్థానికులు అడ్డుకున్నారు. ఇటీవల రాజగోపాల్ రెడ్డి మైకు లాక్కోవాలని ప్రయత్నించారు కొంతమంది. రోజు రోజుకీ ఆయనపై ఒత్తిడి పెరిగిపోతోంది.

వాహనంపై ఉండి ప్రసంగించడానికి కూడా రాజగోపాల్ రెడ్డి ఇబ్బంది పడుతున్నారు. ఆయన ప్రసంగానికి పదే పదే స్థానికులు అడ్డు తగులుతున్నారు. వింటే వినండి, లేకపోతే పొండి, ఇచ్చింది తీసుకుని గమ్మునుండండి.. అంటూ రాజగోపాల్ రెడ్డి ప్రచార వాహనం పైనుంచే వార్నింగ్ లు ఇస్తున్నారు. కనీసం ప్రసంగించడానికి కూడా వీలు లేకపోవడంతో ఆయన తెగ ఇదైపోతున్నారు. ఇక జనాల్లోకి వెళ్లే పరిస్థితి ఎక్కడ..?

గోపాల్ వర్సెస్ పాల్..

ప్రజల్లోకి వెళ్లే విషయంలో రాజగోపాల్ రెడ్డి కంటే కేఏ పాల్ బెటర్ అని అంటున్నారు నెటిజన్లు. పాల్ కామెడీ చేసినట్టే ఉన్నా.. ఆయన కాన్ఫిడెంట్ లెవల్స్ వేరు. మునుగోడుకి కాబోయే ఎమ్మెల్యేని తానేనంటూ గ్రామాల్లో కలియదిరుగుతున్నారు పాల్. యువతకు ఉద్యోగాలిప్పిస్తాను, ఆస్పత్రులు కట్టిస్తాను, అభివృద్ధి చేస్తాననే నినాదాలతో ఆయన ముందుకెళ్తున్నారు. జనం కూడా ఆయన్ను నవ్వుతూ పలకరిస్తున్నారు, ఆయన చెప్పే మాటలేవీ నిజం కావని తెలిసినా, సరదాగా తీసుకుంటున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి పరిస్థితి వేరు. ఆయన్ను కనీసం కారు దిగేందుకు కూడా కొన్ని గ్రామాల్లో ప్రజలు అనుమతివ్వడంలేదు. అటునుంచి అటే తరిమేస్తున్నారు. 18వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పనులకు రాజగోపాల్ రెడ్డి అమ్ముడుపోవడమే కాకుండా, నియోజకవర్గ ప్రజల్ని కూడా తెగనమ్మాలనుకోవడం స్థానికుల్ని తీవ్రంగా కలచి వేసింది. అందుకే రాజగోపాల్ రెడ్డికి గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు మునుగోడు వాసులు.

First Published:  25 Oct 2022 8:43 AM IST
Next Story