షర్మిల పాత వ్యూహాలనే పట్టుకున్నారా..?
మొన్నటికి మొన్న ''ఆ జగన్‌తో మనకెందుకు..?, ఆ రాష్ట్రంతో(ఏపీతో) మనకెందుకు..?'' అని మాట్లాడిన విజయమ్మ.. తాజాగా ఒక ఛానల్‌తో మాట్లాడుతూ జగన్‌ను టచ్ చేసే వాళ్లు ఏపీలో లేరు.. తెలంగాణలోనే ఏం జరుగుతుందో చూద్దామంటూ మాట్లాడటంపై ట్రోలింగ్ జరుగుతోంది.
వైఎస్ షర్మిల పార్టీకి ఇప్పటి వరకు ఎలాంటి మైలేజ్ రాలేదు. కానీ, ఆమె టీఆర్‌ఎస్ పెద్దలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, చీటికిమాటికి రోడ్లపై బైఠాయించడం ద్వారా మాత్రం మీడియా దృష్టిని బాగానే ఆకర్శిస్తున్నారు. ఇదేదో బాగుంది అనుకున్నారేమో గానీ.. ఆమె పదేపదే అదే పనిచేస్తున్నారు. అప్పట్లో జగన్ అరెస్ట్ సమయంలో ఇలాగే కుటుంబ సభ్యులంతా రోడ్డుపై బైఠాయించడంతో సానుభూతి భారీగా వచ్చింది. కాకపోతే అప్పుడు అది డ్రామా కాదు. అలా ఎవరికీ అనిపించలేదు కూడా.
ఇప్పుడు మాత్రం ప్రజలు, నెటిజన్లు షర్మిలది ముమ్మాటికీ హైడ్రామానే అంటూ ట్రోల్ చేస్తున్నారు. జాతీయ పార్టీల నాయకులు కూడా ప్రశాంతంగా తమ పనిచేసుకుపోతున్న చోట.. షర్మిలను మాత్రమే నిలువరించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంటుంది..?, అసలు ఆమెకు, ఆమె పార్టీకి అంత సీన్ ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు. షర్మిల ఫాలోయింగ్ ఏపాటిదో ఆమె సోషల్ మీడియా ఖాతాల్లోని ఫాలోవర్స్ సంఖ్య చూసినా అర్థమవుతుందని ఎద్దేవా చేస్తున్నారు. ఒకప్పుడు ఎంతో హుందాగా బతికిన వైఎస్‌ఆర్ పేరును ఉపయోగించుకుంటూ.. వీరు పదేపదే రోడ్ల మీద బైఠాయిస్తూ రాజకీయంగా లబ్దిపొందేందుకు పాకులాడుతున్న తీరు, వైఎస్ కుటుంబమే ఒక డ్రామా కుటుంబం అన్న పేరు రావడానికి షర్మిల ప్రధాన కారణం అవుతున్నారన్న విమర్శ వస్తోంది.
పైగా మొన్నటికి మొన్న ''ఆ జగన్‌తో మనకెందుకు..?, ఆ రాష్ట్రంతో(ఏపీతో) మనకెందుకు..?'' అని మాట్లాడిన విజయమ్మ.. తాజాగా ఒక ఛానల్‌తో మాట్లాడుతూ జగన్‌ను టచ్ చేసే వాళ్లు ఏపీలో లేరు.. తెలంగాణలోనే ఏం జరుగుతుందో చూద్దామంటూ మాట్లాడటంపైనా ట్రోలింగ్ జరుగుతోంది. ఈ వ్యాఖ్యల ఆధారంగా కుటుంబ సభ్యులంతా కలిసే డ్రామా ఆడుతున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
తాజాగా పాదయాత్రకు అనుమతి ఇవ్వాలంటూ షర్మిల తన ఇంటి దగ్గరే దీక్షకు దిగారు. షర్మిలకు మద్దతుగా ఆమె తల్లి విజయమ్మ కూడా కూర్చున్నారు. అయితే అర్ధరాత్రి షర్మిల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అక్కడి నుంచి ఆ పక్కనే ఉన్న అపోలో ఆస్పత్రిలో చేర్చారు. దీక్ష సమయంలోనూ ఆమె సీఎం కేసీఆర్‌పై పరుష పదజాలంలో విమర్శలు చేశారు. తాను టీఆర్‌ఎస్ నేతల అవినీతి అక్రమాలను బయటపెడుతానన్న భయంతోనే యాత్రకు అడ్డుపడుతున్నారని విమర్శించారు. షర్మిలను వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి పరామర్శించారు.