Telugu Global
Telangana

చందాలేసుకుని టికెట్లు కొంటారు.. కానీ, రైలెక్క‌రు..!

నర్సంపేట నియోజకవర్గం మొత్తానికి ఉన్న ఏకైక రైల్వేస్టేషన్‌ నెక్కొండ. నియోజక వర్గ ప్ర‌జ‌లు రైలు ప్ర‌యాణం చేయాలంటే ఈ రైల్వేస్టేష‌నే దిక్కు.

చందాలేసుకుని టికెట్లు కొంటారు.. కానీ, రైలెక్క‌రు..!
X

టికెట్ లేకుండా రైలెక్కేవాళ్ల‌ను చూశాం.. కానీ, రోజూ టికెట్లు కొని రైలు ఎక్క‌నివాళ్లు ఉంటారా..? ఒక‌రో ఇద్ద‌రో ప్ర‌యాణం క్యాన్సిల్ చేసుకున్నారేమో, ట్రైన్ మిస్స‌య్యిందేమో అనుకుంటున్నారా..? కానే కాదు ఉమ్మ‌డి వ‌రంగ‌ల్‌ జిల్లా నెక్కొండ రైల్వేస్టేషన్‌లో స్థానిక ప్ర‌జ‌లు రోజూ కనీసం 60 టికెట్లు కొంటారు. కానీ ఒక్క‌రు కూడా రైలెక్క‌రు. దీనికి కార‌ణం తెలిస్తే మాత్రం వాళ్ల‌ను మెచ్చుకోకుండా ఉండ‌లేరు.

రైళ్లు ఆగ‌క ప్ర‌జ‌ల ఇబ్బందులు

నర్సంపేట నియోజకవర్గం మొత్తానికి ఉన్న ఏకైక రైల్వేస్టేషన్‌ నెక్కొండ. నియోజక వర్గ ప్ర‌జ‌లు రైలు ప్ర‌యాణం చేయాలంటే ఈ రైల్వేస్టేష‌నే దిక్కు. అయితే ఇక్కడ చాలా ట్రైన్ల‌కు హాల్ట్ లేదు. దీంతో దూర ప్ర‌యాణాలు చేయాల్సిన‌వారు ఇక్క‌డ ఆగే రైళ్ల‌లో వ‌రంగ‌ల్‌, కాజీపేట‌, సికింద్రాబాద్ వంటి స్టేష‌న్ల‌కు వెళ్లి అక్క‌డి నుంచి వేరే రైలెక్కాల్సి వ‌స్తోంది. స్థానికులు రైల్వే అధికారులు చాలాసార్లు మొర‌పెట్టుకోగా సికింద్రాబాద్‌- గుంటూరు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు టెంపరరీ హాల్టింగ్‌ ఇచ్చారు. 3 నెలలపాటు ఆదాయం వస్తేనే పూర్తిస్థాయిలో హాల్టింగ్‌ కల్పిస్తామని, లేకపోతే రద్దు చేస్తామని కండిష‌న్ కూడా పెట్టారు.

ట్రైన్ హాల్టింగ్ క్యాన్సిల్ కాకుండా..

తాత్కాలికంగా ఇచ్చిన హాల్టింగ్‌ను ఎలాగైనా ప‌ర్మినెంట్ చేసుకోవాల‌ని గ్రామస్థులు సంక‌ల్పించారు. ‘నెక్కొండ పట్టణ రైల్వే టికెట్స్‌ ఫోరం’ పేరుతో వాట్సప్‌ గ్రూపు పెట్టారు. ఇందులో సుమారు 400 మంది చేరి, విరాళాల రూపంలో రూ.25 వేలు సమకూర్చారు. ఈ డబ్బుతో రోజూ నెక్కొండ నుంచి ఖమ్మం, సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాలకు ట్రైన్ టికెట్స్ కొంటున్నారు. త‌ద్వారా స్టేషన్‌కు ఆదాయం చూపించ‌గ‌లుగుతున్నామ‌ని వారు చెబుతున్నారు. మ‌రింత మందిని ఈ గ్రూప్‌లో చేర్చుకుని మ‌రిన్ని టికెట్లు కొని, ఇంకొన్ని రైళ్ల హాల్టింగ్‌ కోసం ప్ర‌య‌త్నిస్తామ‌ని చెబుతున్నారు. మంచి ఆలోచ‌నే కదా.. ఆల్ ద బెస్ట్ !

First Published:  12 Feb 2024 12:48 PM IST
Next Story