విద్యుత్ ఉద్యోగులతో చర్చలు సఫలం.. రేపటి నుంచి జరగాల్సిన సమ్మె విరమణ
విద్యుత్ ఉద్యోగుల సమ్మె నోటీసు జారీ చేయడంతో.. లేబర్ కమిషనర్ జోక్యం చేసుకొని, సయోధ్య కుదర్చాలని సీఎండీ ప్రభాకర్‌రావు కోరారు.
తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు ఈ నెల 17 నుంచి తలపెట్టాల్సిన సమ్మెను విరమించారు. టీఎస్ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావుతో విద్యుత్ ఉద్యోగుల చర్చలు సఫలం అయ్యాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన 7 శాతం పీఆర్సీకి విద్యుత్ ఉద్యోగులు అంగీకరించారు. దీంతో రేపటి నుంచి తలపెట్టాల్సిన సమ్మెకు బ్రేక్ పడింది. తమకు 7 శాతం పీఆర్సీ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు సీఎండీకి ఉద్యోగులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఈ నెల 17 నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు ప్రకటించింది. వేతన సవరణ, ఈపీఎస్, జీపీఎఫ్, ఆర్టిజన్ వంటి అంశాలను పరిశీలించాలని కొంత కాలంగా ఉద్యోగులు కోరుతున్నారు. ఆ మేరకు విద్యుత్ సంస్థల యాజమాన్యాలను పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అయితే అప్పటికే ప్రభుత్వం 6 శాతం ఫిట్‌మెంట్ ప్రతిపాదించింది. కానీ, ఉద్యోగులు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు తమ డిమాండ్‌లతో కూడిన వినతిపత్రం అందజేశారు.
కాగా, విద్యుత్ ఉద్యోగుల సమ్మె నోటీసు జారీ చేయడంతో లేబర్ కమిషనర్ జోక్యం చేసుకొని, సయోధ్య కుదర్చాలని సీఎండీ ప్రభాకర్‌రావు కోరారు. ఈ మేరకు ఏప్రిల్ 7న లేబర్ కమిషనర్‌కు ప్రభాకర్‌రావు లేఖ రాశారు. టీఎస్పీఈ జాక్‌తో ఇప్పటి వరకు ఐదు సార్లు చర్చలు జరిపారు. విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొనే 6 శాతం ఫిట్‌మెంట్ ప్రతిపాదించినట్లు వివరించారు. ఈ పరిణామాలు ఇలా కొనసాగుతుండగా.. శనివారం జరిగిన చర్చలు విజయవంతం అయ్యాయి. 7 శాతం పీఆర్సీకి ఉద్యోగ సంఘాలు అంగీకరించడంతో.. సమ్మె ఆగిపోయింది.