పాఠ్య పుస్తకాల్లో నుంచి 'ప్రజాస్వామ్యం' సిలబస్ తొలగించిన ఎన్సీఈఆర్టీ
డెమోక్రసీ విభాగంలో ప్రజాస్వామ్యం పుట్టు పూర్వోత్తరాలు, రాజకీయా పార్టీలు వంటి పాఠాలను తొలగించారు.
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో పలు పాఠ్యాంశాలను తొలగిస్తూ వార్తల్లోకి ఎక్కిన ఎన్టీఈఆర్టీ.. ఈ సారి పదవ తరగతి సిలబస్ నుంచి ప్రజాస్వామ్యానికి సంబంధించిన పాఠ్యాంశాలతో పాటు పిరియాడిక్ టేబుల్ వంటి పాఠ్యాంశాలను తొలగించింది. విద్యార్థులపై చదువుల భారం పడకుండా ఉండేందుకే ఈ పాఠ్యాంశాలను తొలగించినట్లు ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేశ్ సక్లానీ తెలిపారు.
డెమోక్రసీ విభాగంలో ప్రజాస్వామ్యం పుట్టు పూర్వోత్తరాలు, రాజకీయా పార్టీలు వంటి పాఠాలను తొలగించారు. డెమోక్రసీ విభాగంలోని ప్రజాస్వామ్యానికి సవాళ్లు అనే పాఠాన్ని కూడా పక్కకు పెట్టారు. ఇక సైన్స్ విభాగంలో రసాయనిక మూలకాల పట్టిక (పిరియాడిక్ టేబుల్)ను కూడా తీసేశారు. దీంతో పాటు ఇంధన వనరులు అనే పాఠ్యాంశాన్ని కూడా ఎత్తివేశారు. ఈ పాఠాలు పదవ తరగతి వివ్యార్థులు అవసరం లేదని ఎన్సీఈఆర్టీ అభిప్రాయపడింది. ఈ మార్పులు ఇప్పటివి కావని.. కోవిడ్ తరువాత విద్యార్థులకు పాఠాల భారం తగ్గించే దిశలో చేపట్టిన చర్యఅని చెప్పారు. భవిష్యత్‌లో కూడా ఇలాంటి చర్యలు కొనసాగుతాయని డైరెక్టర్ దినేశ్ సక్లానీ చెప్పారు.
గత కొన్ని రోజులుగా 9, 10, 11, 12 తరగతులకు సిలబస్‌లు తగ్గిస్తూ వస్తోంది. అయితే రసాయనిక మూలకాల పట్టికను తీసివేయడం వల్ల సైన్స్ పట్ల భవిష్యత్‌లో సరైన అవగాహన లేకుండా పోతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియాలో పదవ తరగతి వరకు సైన్స్ తప్పనిసరి పాఠ్యాంశంగా ఉంది. ఆ తర్వాత వేర్వేరు సబ్జెక్టులు ఎందుకొని చదవవచ్చు. ఇప్పుడు 10వ తరగతిలో పిరియాడిక్ టేబుల్ తీసి వేస్తే.. భవిష్యత్‌లో వేరే కోర్సులు ఎంచుకునే విద్యార్థులు ఎప్పటికీ చదవుకోలేని పరిస్థితి ఎదురవుతుంది.
ఇక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న ఇండియాలో.. డెమోక్రసీకి సంబంధించిన పాఠాలు తొలగించడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వామ్యం అంటే ఏంటో.. ప్రభుత్వాలు ఎలా పని చేస్తాయో తెలియజేయకపోతే.. విద్యార్థులకు రాజకీయ అవగాహన లేకుండా పోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పదవ తరగతి లోపు విద్యార్థులు కొన్ని కీలకమైన విషయాలు తెలుసుకోవల్సి ఉంటుందని.. కానీ ఇప్పుడు వాటిని తొలగించడం హేయమైన చర్య అని వారు అభిప్రాయపడుతున్నారు.