Telugu Global
Telangana

జాతీయ స్థాయి పోటి పరీక్ష ప్రశ్నాపత్రం లీక్, ఐదుగురు అరెస్ట్... సంజయ్ పై కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్

ఎలక్ట్రానిక్, మాన్యువల్ నిఘా ఉపయోగించి, పేపర్ లీక్‌కు సంబంధించిన సంభాషణలు, చాట్ లు, ఈ స్కాంలో పాల్గొన్న వ్యక్తుల వివరాలను తెలుసుకుని, పారామౌంట్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో దాడులు నిర్వహించి నిందితుడు అరుణ్‌జయ్ (37)ను పట్టుకున్నట్లు రవీంద్ర సింగ్ తెలిపారు.

జాతీయ స్థాయి పోటి పరీక్ష ప్రశ్నాపత్రం లీక్, ఐదుగురు అరెస్ట్... సంజయ్ పై కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్
X

జాతీయ స్థాయి పోటి పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ ఐదుగురు అరెస్ట్... 'సంజయ్ బ్రో...' అంటూ కేటీఆర్ వ్యంగ్య ట్వీట్నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్‌టిఆర్‌ఓ) పరీక్ష పేపర్ లీక్‌లో ప్రమేయం ఉన్న ఐదుగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది.

వారిని అరుణ్‌జయ్, అరుణ్ కుమార్, సుభాష్ చంద్, దీపక్ రాఘవ్, గోవింద్ కుమార్‌లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

ఎన్‌టిఆర్ఓ పరీక్ష కేంద్రం ఉన్న ఒక పాఠశాలలో అరుణ్‌జయ్ అసిస్టెంట్ పరీక్ష సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారని, ఆయన ద్వారా ముఠా ఈ లీక్ కు పాల్పడిందని, వాట్సప్ ద్వారా మొత్తం వ్యవహారం నడిపించారని పోలీసులు తెలిపారు.

ఎన్‌టిఆర్‌ఓ ఏవియేటర్-II, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ద్వారకా సెక్టార్-23లోని పారామౌంట్ స్కూల్‌లో నిర్వహించబోతున్న పరీక్షల్లో ఎగ్జామ్ పేపర్ లీక్ అయినట్టు మార్చి 4న డిసిపి సతీష్ కుమార్‌కు సమాచారం అందిందని స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్ బ్రాంచ్) రవీంద్ర సింగ్ యాదవ్ తెలిపారు. ఎన్‌టిఆర్‌ఓ ఏవియేటర్-IIకి దాదాపు రూ. 30 లక్షలు, టెక్నికల్ అసిస్టెంట్ పరీక్షల కోసం దాదాపు రూ. 15 లక్షలు అభ్యర్థుల నుండి తీసుకున్నట్టు వెల్లడైంది. మాస్టర్‌మైండ్ అరుణ్‌జయ్ పేపర్‌లను లీక్ చేసి ఆన్సర్ 'కీ'లను అందిస్తాడని కూడా వెల్లడైంది.

ఎలక్ట్రానిక్, మాన్యువల్ నిఘా ఉపయోగించి, పేపర్ లీక్‌కు సంబంధించిన సంభాషణలు, చాట్ లు, ఈ స్కాంలో పాల్గొన్న వ్యక్తుల వివరాలను తెలుసుకుని, పారామౌంట్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో దాడులు నిర్వహించి నిందితుడు అరుణ్‌జయ్ (37)ను పట్టుకున్నట్లు రవీంద్ర సింగ్ తెలిపారు.

విచారణలో, అతని మొబైల్ ఫోన్‌లో ప్రశ్నపత్రం సి-సెట్ ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. ఆ సెట్ కు సంబంధించిన సమాధానాల కీలు కూడా ఉన్నాయి. అరుణ్‌జయ్ వాట్సాప్ ఖాతాలో, అభ్యర్థులకు సమాధానాల కీలను అందించడానికి డబ్బు బదిలీ సందేశాలతో పాటు చాలా మంది అభ్యర్థుల అడ్మిట్ కార్డ్‌లు కూడా కనుగొన్నారు.

ఈ కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేయగా జవాబు కీలను అందించిన వ్యక్తి పరారీలో ఉన్నాడని, అతడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.

ఇంతకుముందు ఇటువంటి నేరాలు సాధారణంగా ప్రింటింగ్ ప్రెస్ లలో, లేదా పేపర్ల రవాణా సమయంలో లేదా పరీక్షా కేంద్రాల వద్ద అధికారులకు లంచం ఇవ్వడం ద్వారా జరిగేవి. అయితే, ఇలాంటి కేసులు పెరగడంతో పరీక్షా బోర్డులు తమ వ్యవస్థలను పటిష్టం చేశాయని, ఇలాంటి కార్యకలాపాలకు చెక్ పెట్టాయని రవీందర్ సింగ్ చెప్పారు

“అయితే, ఈ కేసులో నిందితులు, అధికారులు తనిఖీకి వెళ్ళడానికి చాలా తక్కువ అవకాశం ఉండే సుదూర పరీక్షా కేంద్రాలను సంప్రదించారు. వారు ఆ సెంటర్ ప్రిన్సిపాల్, ఇతర అధికారులను లంచాలతో ప్రలోభపెట్టారు.

“పరీక్ష ప్రారంభానికి ఒకటి లేదా ఒకటిన్నర గంటల ముందు పేపర్లు కేంద్రానికి వస్తాయని వారికి తెలుసు. పరీక్ష ప్రారంభానికి ముందు వారి వద్ద ఉన్న ఈ సమయ గ్యాప్ పేపర్ల ఫోటోలను తీయడానికి, దానిని వాట్సప్ ద్వారా దూరంగా ఉన్న జవాబులు తయారు చేసేవాళ్ళకు బదిలీ చేయడానికి సరిపోతుంది. ,” అన్నారు యాదవ్.

కాగా , తెలంగాణ లో TSPSC పేపర్ లీకేజీ సంఘటన‌కు కేసీఆరే కారణమంటూ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో జాతీయ స్థాయి ప్రశ్న పత్రం లీకేజీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్ప‍ంధించారు.

''జాతీయ స్థాయి పోటీ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందట బండి సంజయ్ బ్రో. పద వెళ్లి ఇందులో మోడీ కి , అమిత్ షా కి వాటా ఉందని గొడవ చేద్దాం , అసమర్థ మోడీ రాజీనామా చేయాలని గత్తర లేపుదాం

తెలంగాణ లో నువ్వన్న మాటలు ఢిల్లీ లో కూడా వర్తిస్తాయి కదా బ్రో'' అని దినేశ్ చౌదరి అనే నెటిజన్ చేసిన ట్వీట్ ను కేటీఆర్ రీ ట్వీట్ చేశారు.


First Published:  16 March 2023 3:16 AM GMT
Next Story