Telugu Global
Telangana

మునుగోడు టీఆర్ఎస్‌లో అసంతృప్తి లేదు.. ఆ ఇద్దరికీ కేసీఆర్ హామీలు..

నర్సయ్య గౌడ్, ప్రభాకర్ ఇద్దరికీ బీఆర్ఎస్‌లో జాతీయ రాజకీయాల్లో అత్యధిక‌ ప్రాధాన్యం ఉంటుందని చెప్పారట కేసీఆర్. ఈ నేపథ్యంలో వారిద్దరూ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు.

మునుగోడు టీఆర్ఎస్‌లో అసంతృప్తి లేదు.. ఆ ఇద్దరికీ కేసీఆర్ హామీలు..
X

టీఆర్ఎస్‌లో మునుగోడు టికెట్ కోసం ముగ్గురు పోటీపడ్డారు. ఆ ముగ్గురిలో ఒకరికి అవకాశం వరించింది. మరి మిగతా ఇద్దరి సంగతేంటి..? వారు అసంతృప్తులుగా మిగిలిపోతారా..? పార్టీ అభ్యర్ధి ఓటమికి పరోక్షంగా కృషి చేస్తారా..? విపక్షాలతో చేతులు కలుపుతారా..? ఇలాంటి అవకాశాలుంటాయని వైరి వర్గాలు ఎదురు చూశాయి. కానీ సీఎం కేసీఆర్ భేటీ తర్వాత ఆ ఇద్దరూ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే తమ పూర్తి మద్దతు ప్రకటించారు. ఆయన గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పారు.

మునుగోడు టికెట్ కూసుకుంట్లకేనని మొదటి నుంచీ వార్తలొచ్చాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా ఆయన నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్నారు, అక్కడే పార్టీ ఇన్‌చార్జిగా పనిచేస్తున్నారు. దీంతో అందరూ ఆయనే అభ్యర్థి అనుకున్నారు. కానీ అనూహ్యంగా మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పోటీకి వచ్చారు.. ఇద్దరూ టికెట్ ఆశించారు. కానీ సీఎం కేసీఆర్ చివరకు కూసుకుంట్లనే ఎంపిక చేశారు. ఆ తర్వాత టికెట్ ఆశించిన మిగతా ఇద్దరితో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారి భవిష్యత్‌కి భరోసా ఇచ్చారు.

సీఎం కేసీఆర్‌తో భేటీ అనంతరం టికెట్ ఆశించిన ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడారు. మునుగోడు ఉపఎన్నికలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ బలోపేతం కోసమేనని అన్నారాయన. మునుగోడు టీఆర్ఎస్‌లో అసంతృప్తి లేదని స్పష్టం చేశారు. అందరిలాగా తానూ టికెట్ ఆశించానని, తనకు ఆ హక్కు ఉందని తెలిపారు ప్రభాకర్. అయితే కేసీఆర్ నిర్ణయం అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు.

జాతీయ రాజకీయాల్లో..

నర్సయ్య గౌడ్, ప్రభాకర్ ఇద్దరికీ బీఆర్ఎస్‌లో జాతీయ రాజకీయాల్లో అత్యధిక‌ ప్రాధాన్యం ఉంటుందని చెప్పారట కేసీఆర్. ఈ నేపథ్యంలో వారిద్దరూ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్‌లో అసంతృప్తి మొదలవుతుందనుకున్న విపక్షాల ఆశలపై నీళ్లు చల్లారు.

First Published:  7 Oct 2022 5:49 PM IST
Next Story