Telugu Global
Telangana

నరేందర్‌రెడ్డిది అరెస్టా? కిడ్నాపా?

సీఎం తీసుకున్న అనాలోచిత, పిచ్చి నిర్ణయం వల్లనే కొడంగల్‌ రగులుతున్నదన్న కేటీఆర్‌

నరేందర్‌రెడ్డిది అరెస్టా? కిడ్నాపా?
X

పట్నం నరేందర్‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. కుటంబానికి సమాచారం ఇవ్వకుండా ఎలా తీసుకెళ్తారని అధికారులను నిలదీశారు. తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ప్రభుత్వ అనాలోచిన చర్యల వల్ల ప్రజలు ఆగమవుతున్నారని విమర్శించారు. రైతుల ఆక్రందనలపై సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించాలని డిమాండ్‌ చేశారు. మీరు తీసుకున్న అనాలోచిత, పిచ్చి నిర్ణయం వల్లనే కొడంగల్‌ రగులుతున్నది. రైతులు అక్రమ అరెస్టయి జైలుకు పోతుంటే, మా నాయకుడు పట్నం నరేందర్‌రెడ్డి టెర్రరిస్టును ఈడ్చుకుని వెళ్లినట్లు తీసుకెళ్లారు. అరెస్టు చేస్తున్నట్లు ఆయన భార్యకైనా సమాచారం ఇచ్చారా? అరెస్టు వారెంటు ఉన్నదా? అని ప్రశ్నించారు. ఆయన ఏమైనా బందిపోటా? తీవ్రవాదినా? పోలీసులు మఫ్టీలో వచ్చి ఎలా తీసుకెళ్తారని అడిగారు. అది అరెస్టా? కిడ్నాపా? అని నిలదీశారు.

ఇష్టం వచ్చినట్లు ఇండ్లమీదికి వచ్చుడు, కేబీఆర్‌ పార్కులు వాకింగ్‌ చేస్తుంటే అక్కడికి వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సొంత నియోజకవర్గంలో రైతులు ఆందోళన చేస్తుంటే, అక్రమ అరెస్టులు చేస్తుంటే, ప్రజలు ఆక్రందనలు చేస్తుంటే ఆయన ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. దీనిపై సీఎం ఎందుకు స్పందించడం లేదన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్‌ వాళ్లకు సంచులు మోసుకోవడం తప్పా నీ వల్ల అయ్యేది ఏమున్నదని ఎద్దేవా చేశారు. సీఎం కొడంగల్‌కు వస్తారా? లగచర్లకు వస్తారా? హకీంపేటకు వస్తారా? దుద్యాలకు వస్తారా? ఎక్కడి వస్తారో రమ్మని కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. రైతులతో కూర్చుని మీ ఆలోచన వల్ల రైతులకు ఒనగూరే లాభమేమిటో వివరించాలన్నారు. దళిత, గిరిజన, బీసీల భూములను లాక్కోని వాళ్ల అనుయాయుల, వాళ్ల కుటుంబ సభ్యులకు, రియల్‌ ఎస్టేట్‌ పేరిట వ్యాపారం చేసుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి చేస్తున్న కుట్ర అని అందరికీ అర్థమైందన్నారు. ఇది కాంగ్రెస్‌ ప్రజాపాలన కాదు, ఇందిరమ్మ రాజ్యం కాదు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని తలపిస్తున్న పరిస్థితి అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఇంటర్నెట్‌ సేవలు బంద్‌ పెట్టారు. ఏ రూల్‌ ప్రకారం నరేందర్‌రెడ్డిని అరెస్టు చేశారని ప్రశ్నించారు.

నరేందర్‌రెడ్డికి ప్రైవేట్‌ సిబ్బందితో మెడికల్‌ టెస్టులు చేయించాలి. గవర్నమెంట్‌ డాక్టర్లు, ప్రభుత్వ వ్యవస్థపై మాకు నమ్మకం లేదు. అరెస్టు చేసిన వారిని చిత్ర హింసలు పెట్టారని మాకు సమాచారం ఉన్నది. కలెక్టర్‌ దాడి జరగలేదన్నారు. దాడి జరిగిందని ఐజీ చెబుతున్నారు. కలెక్టర్‌ దాడి జరగలేదంటే ఐజీ దాడి జరిగిందని ఎలా చెబుతారని కేటీఆర్‌ ప్రశ్నించారు. వికారాబాద్‌ లగచర్ల ఘటన నిఘా వ్యవస్థ వైఫల్యమే అన్నారు. ఉద్దేశపూర్వకంగా అంశాతి రగిల్చి భూములు లాక్కునే ప్రయత్నమిది అని ఆరోపించారు.

నరేందర్‌రెడ్డి అరెస్టుపై కోర్టులో పోరాటం చేస్తాం

పోలీసుల అదుపులో ఉన్న కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెండెట్‌ కేటీఆర్‌ ఫోన్‌లో మాట్లాడారు. అక్రమ అరెస్టుపై ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలన్నారు. ప్రభుత్వ అప్రాస్వామిక విధానాలపై పోరాడుతామన్నారు. పట్నం నరేందర్‌రెడ్డి సతీమణి శృతితో కేటీఆర్‌ మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ మొత్తం కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నరేందర్‌రెడ్డి అరెస్టుపై కోర్టులో పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు.

First Published:  13 Nov 2024 8:19 AM GMT
Next Story