Telugu Global
Telangana

దేశమంతా నరకాసుర దహనం.. నల్లగొండలో ఫ్లోరోసిస్ రక్కసి దహనం..

ఐదారేళ్లుగా నల్లగొండ జిల్లాలో ఒక్క ఫ్లోరైడ్ కేసు కూడా నమోదు కాలేదంటే దానికి కారణం సీఎం కేసీఆర్ మాత్రమే. రాబోయే తరాలకు ఫ్లోరైడ్ ముప్పు పూర్తిగా తప్పిపోయినట్టేనని నిపుణులు చెబుతున్నారు.

దేశమంతా నరకాసుర దహనం.. నల్లగొండలో ఫ్లోరోసిస్ రక్కసి దహనం..
X

దీపావళి రోజు చాలా చోట్ల నరకాసురుడి దిష్టిబొమ్మ దహనం చేస్తారు. నరకాసురుడి పీడ విరగడైపోయినందుకు ప్రతి ఏడాదీ పండగ చేసుకుంటారు. నల్లగొండ జిల్లా వాసులు మాత్రం నరకాసురుడితోపాటు ఫ్లోరోసిస్ భూతం దిష్టిబొమ్మని కూడా తగలబెట్టారు. తమ జీవితాల్లోనుంచి ఫ్లోరోసిస్ భూతాన్ని తరిమికొట్టిన సీఎం కేసీఆర్ ని దేవుడిగా భావిస్తూ పండగ చేసుకున్నారు.

ఫ్లోరోసిస్ రక్కసిని చంపింది కేసీఆరే..

నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్య దశాబ్దాలుగా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నో సర్వేలు, సమాలోచనలు జరిగినా పరిష్కారం మాత్రం సాధ్యం కాలేదు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్, ఫ్లోరోసిస్ భూతాన్ని తరిమికొట్టారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే 50 వేల కోట్ల రూపాయలు మిషన్ భగీరథకు కేటాయించి నల్లగొండ జిల్లాతోపాటు మిగతా ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందుల్ని తీర్చారు. అప్పటి వరకూ ఫ్లోరైడ్ విషాన్ని తాగుతూ వైకల్యంతో జీవిస్తున్న వారికి మంచినీటిని అందించారు. భవిష్యత్ తరాలకు భరోసా అందించారు. ఇకపై ఫ్లోరైడ్ రక్కసి మీ జీవితాల్లోకి రాబోదు అని అభయమిచ్చారు.


మిషన్ భగీరథతో నల్లగొండ జిల్లా వాసులకు ఫ్లోరైడ్ నీరు తాగే బాధ తప్పింది. దీంతో ఐదారేళ్లుగా ఫ్లోరైడ్ కేసులు జిల్లాలో నమోదు కాలేదు. అప్పటికే ఫ్లోరైడ్ సమస్యతో అవస్థలు పడుతున్నవారిని ఆర్థికంగా ఆదుకుంది ప్రభుత్వం. వారి జీవనోపాధికి కూడా సాయం చేసింది. కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఐదారేళ్లుగా నల్లగొండ జిల్లాలో ఒక్క ఫ్లోరైడ్ కేసు కూడా నమోదు కాలేదంటే దానికి కారణం సీఎం కేసీఆర్ మాత్రమే. రాబోయే తరాలకు ఫ్లోరైడ్ ముప్పు పూర్తిగా తప్పిపోయినట్టేనని నిపుణులు చెబుతున్నారు.

ఫ్లోరైడ్ రక్కసి దహనం..

నరకాసురుడితోపాటు, ఫ్లోరైడ్ రక్కసిని కూడా ఈసారి దహనం చేశారు నల్లగొండ వాసులు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక నాయకులతో కలసి టపాకాయలు కాల్చారు. వికలాంగుల సంక్షేమ సంఘం నాయకులు, ఫ్లోరోసిస్ ఉద్యమకారులు, ఫ్లోరోసిస్ విముక్త పోరాట సమితి నాయకులు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీపావళిని ఘనంగా జరుపుకున్నారు. ఫ్లోరోసిస్ తో ఇబ్బంది పడుతున్న తమ జీవితాల్లో నిజమైన వెలుగులు నింపింది కేసీఆరేనంటూ కీర్తించారు.

First Published:  25 Oct 2022 9:43 AM IST
Next Story