Telugu Global
Telangana

మల్కాజ్ గిరిలో ఫస్ట్ వికెట్.. కాంగ్రెస్ కి బీసీలు గుడ్ బై

బీసీలకు అదనంగా టికెట్లు ఇవ్వడం అటుంచి, ఉన్న సీట్లకే కాంగ్రెస్ ఎసరు పెడుతోంది. ఈ దశలో 34 సీట్లు అనేది వారికి అందని ద్రాక్షే. అందుకే బీసీలు కాంగ్రెస్ పై తిరుగుబాటు చేసేలా ఉన్నారు.

మల్కాజ్ గిరిలో ఫస్ట్ వికెట్.. కాంగ్రెస్ కి బీసీలు గుడ్ బై
X

బీసీలకు పెద్దపీట వేస్తాం, వెనకబడిన వర్గాలను దగ్గరకు తీసుకుంటామంటూ కబుర్లు చెబుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. ఆచరణలో మాత్రం బీసీలకు గుండు సున్నా చుట్టేలా ఉంది. కనీసం 34 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలంటున్నారు బీసీ నేతలు. చూస్తాం చేస్తామంటూ కబుర్లు చెబుతున్న అధిష్టానం.. వలస నేతలకు పెద్దపీట వేయడంతో బడుగు బలహీన వర్గాలు హస్తానికి గుడ్ బై చెప్పేస్తున్నారు. బీసీలను కాదని, మల్కాజ్ గిరి సీటు మైనంపల్లి హన్మంతరావుకి ఇవ్వడంతో ఆ నియోజకవర్గ బీసీ నేత, జిల్లా పార్టీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరారు. మంత్రి కేటీఆర్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.


మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ ఇద్దరూ ఇటీవలే పార్టీకి రాజీనామా చేశారు. వీరిద్దరిలో నందికంటి శ్రీధర్ తాజాగా బీఆర్ఎస్ లో చేరారు. తిరుపతి రెడ్డి కూడా త్వరలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. 30 ఏళ్లుగా కాంగ్రెస్ కి సేవలు చేస్తే.. చివరకు కొత్తగా చేరిన వారికి టికెట్ ఇచ్చి బీసీలకు అన్యాయం చేశారని ఆరోపిస్తున్నారు నందికంటి శ్రీధర్. కాంగ్రెస్ కోసం ఎలా కష్టపడి పనిచేశానో, బీఆర్ఎస్ కోసం కూడా అలాగే పనిచేస్తానన్నారు. ఆయనతోపాటు పలువురు బీసీ నాయకులు బీఆర్ఎస్ లో చేరారు.

బీఆర్ఎస్ తొలి జాబితాలో మల్కాజ్ గిరి టికెట్ మైనంపల్లికే దక్కింది. ఆయన కాంగ్రెస్ లో చేరడంతో.. ఇప్పుడు కొత్త అభ్యర్థిని వెదకాల్సిన పరిస్థితి. బీఆర్ఎస్ లోనే విపరీతమైన పోటీ ఉంది. ఈ దశలో నందికంటి శ్రీధర్ పేరు పరిగణలోకి తీసుకుంటారనుకోలేం. తనకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా.. బీఆర్ఎస్ ప్రకటించే అభ్యర్థికే మద్దతిస్తానని, బేషరతుగానే పార్టీలో చేరుతున్నానని చెప్పారాయన. పార్టీలో శ్రీధర్ కి, ఆయన అనుచరులకు సముచిత ప్రాధాన్యమిస్తామని హామీ ఇచ్చారు మంత్రి కేటీఆర్.


బీసీల్లో అసంతృప్తి..

బీసీలకు అదనంగా టికెట్లు ఇవ్వడం అటుంచి, ఉన్న సీట్లకే కాంగ్రెస్ ఎసరు పెడుతోంది. ఈ దశలో 34 సీట్లు అనేది వారికి అందని ద్రాక్షే. అందుకే బీసీలు కాంగ్రెస్ పై తిరుగుబాటు చేసేలా ఉన్నారు. నందికంటి శ్రీధర్ కి జరిగిన అన్యాయం మరింత మంది విషయంలో కూడా రుజువయ్యేలా ఉంది. టికెట్ల ప్రకటన తర్వాత మరింతమంది బీసీ నేతలు కాంగ్రెస్ కి గుడ్ బై చెబుతారని తెలుస్తోంది.

First Published:  5 Oct 2023 8:34 AM IST
Next Story