Telugu Global
Telangana

భార్యను చంపిన భర్తకు ఉరిశిక్ష.. కోర్టు సంచలన తీర్పు

ఇమ్రాన్ డబ్బు అవసరం ఉన్నప్పుడల్లా ఇంటికొచ్చి భార్యను వేధించి తీసుకెళ్లేవాడు. కారు కొనుక్కోవడానికి రూ.30వేలు డబ్బు ఇవ్వాలంటూ 2019లో భార్య తరఫు బంధువుల‌ను ఇమ్రాన్ డిమాండ్ చేశాడు.

భార్యను చంపిన భర్తకు ఉరిశిక్ష.. కోర్టు సంచలన తీర్పు
X

భార్య పట్ల కిరాతకంగా ప్రవర్తించి హత్య చేసిన వ్యక్తికి నాంపల్లి అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధించినట్లు హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్ జోన్) సాయి చైతన్య తెలిపారు. హైదరాబాద్ కు చెందిన ఇమ్రాన్ ఉల్ హక్ (38) కారు డ్రైవర్ గా పనిచేసేవాడు. తాను సంపాదించినది విలాసాలకు ఖర్చు పెడుతూ డబ్బు కోసం భార్యను వేధించేవాడు. రోజూ భార్యను శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు పెట్టేవాడు. భార్యకు తెలియకుండా ఇమ్రాన్ రెండో పెళ్లి కూడా చేసుకున్నాడు.

ఇమ్రాన్ డబ్బు అవసరం ఉన్నప్పుడల్లా ఇంటికొచ్చి భార్యను వేధించి తీసుకెళ్లేవాడు. కారు కొనుక్కోవడానికి రూ.30వేలు డబ్బు ఇవ్వాలంటూ 2019లో భార్య తరఫు బంధువుల‌ను ఇమ్రాన్ డిమాండ్ చేశాడు. వారు డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడంతో మొదటి భార్యను చంపాలని అతడు నిర్ణయించుకున్నాడు.

అదే సంవత్సరం జనవరి 6న భార్యతో గొడవపడి ఆమెను దారుణంగా హతమార్చాడు. కత్తెరతో భార్య గొంతులో పొడిచాడు. ఆ తర్వాత ఆమె తలపై సుత్తితో బాదాడు. ఆమె ప్రైవేట్ భాగంలో స్క్రూడ్రైవర్ చొప్పించి కిరాతకంగా ప్రవర్తించాడు. భార్య చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.

భార్య కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 302, ఇతర సంబంధిత సెక్ష‌న్ల ప్రకారం కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు జడ్జి సీవీఎస్ సాయి భూపతి ఇమ్రాన్ పై మోపబడిన నేరం నిర్ధారణ కావడంతో అతడికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చారు. అలాగే రూ.10వేల జరిమానా కూడా విధించారు.

First Published:  19 Jan 2024 9:11 AM GMT
Next Story