బెంగళూరు పరిస్థితులు మనకు రావొద్దు.. అందుకే ఇలా..
సీఎం కేసీఆర్ ముందుచూపుతో ఆలోచించి నగరంలోని ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకొని స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం (SRDP) రూపొందించారని తెలిపారు మంత్రి కేటీఆర్. 2015లో ఆమోదం పొందిన SRDP ద్వారా ఇప్పటికే 32 నిర్మాణాలు పూర్తి చేశామన్నారు.
జనాభా పెరుగుదల, నగర విస్తరణకు అనుగుణంగా అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలు పెంచుకోకపోతే మనకూ బెంగళూరు పరిస్థితే వస్తుందని హెచ్చరించారు మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్ ముందుచూపుతో ఆలోచించి నగరంలోని ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకొని స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం (SRDP) రూపొందించారని తెలిపారు. 2015లో ఆమోదం పొందిన SRDP ద్వారా మొదటి దశలో రూ.8,052.92 కోట్లతో 47 ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు నిర్మించాల్సి ఉందని, వాటిలో 32 ఇప్పటికే పూర్తయ్యాయని వివరించారు. 16 ఫ్లైఓవర్లు, 5 అండర్ పాస్ లు, 7 రోడ్ ఓవర్ బ్రిడ్జ్ లు, అండర్ బ్రిడ్జ్ లు, ఒక కేబుల్ బ్రిడ్జ్.. ఇలా మొత్తం 32 ప్రాజెక్టులను పూర్తి చేశామన్నారు కేటీఆర్.
నాగోలు ఫ్లైఓవర్ ని ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్, హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏమేం చర్యలు తీసుకుందో వివరించారు. ఆరేళ్ల క్రితం ఎల్బీనగర్ చౌరస్తా గందరగోళంగా ఉండేదని, ఇప్పుడు ఎల్బీ నగర్ లో కోట్లాది రూపాయలతో చేపట్టిన పనులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఈ మధ్య నగరంలో వచ్చిన వరదలను దృష్టిలో పెట్టుకొని ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నాలాల బాగు కోసం రూ.113 కోట్లతో పనులు చేపట్టామని చెప్పారు.
భారీ వర్షాలకు ఇటీవల హైదరాబాద్ లో కూడా ప్రజలు ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. అయితే బెంగళూరు వరదలు వచ్చాకే, హైదరాబాద్ లో పరిస్థితి ఎంత మెరుగ్గా ఉందో అర్థమైంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన కూడా మెరుగవడంతో హైదరాబాద్ లో తక్కువ నష్టం జరిగింది. కానీ బెంగళూరులో మాత్రం పూడ్చుకోలేనంత పెద్ద నష్టం జరిగింది. బెంగళూరులో నూతనంగా విస్తరించిన ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ లో మరింత మెరుగైన ప్రణాళికలు తయారు చేస్తున్నట్టు తెలిపారు మంత్రి కేటీఆర్. SRDP ద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.