Telugu Global
Telangana

మా భవనాన్ని చట్టవిరుద్ధంగా కూల్చివేశారు.. ఎన్‌-కన్వెన్షన్‌ కూల్చివేతపై హీరో నాగార్జున

ఇప్పుడు జరిగిన పరిణామాల వల్ల, మేమేదో కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశముందని ఆయన తెలిపారు.

మా భవనాన్ని చట్టవిరుద్ధంగా కూల్చివేశారు.. ఎన్‌-కన్వెన్షన్‌ కూల్చివేతపై హీరో నాగార్జున
X

మాదాపూర్‌లోని ఎన్‌-కన్వెన్షన్‌ను హైడ్రా ఆధ్వర్యంలో శనివారం ఉదయం కూల్చివేసిన విషయం తెలిసిందే. దీనిపై హీరో నాగార్జున స్పందిస్తూ.. తమ భవనాన్ని చట్టవిరుద్ధంగా కూల్చివేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కన్వెన్షన్‌ ఉన్నది పట్టా భూమిలో అని, అందులో ఒక్క అంగుళం కూడా తాము కబ్జా చేయలేదని స్పష్టం చేశారు. కోర్టు కేసులు, స్టే ఆర్డర్లకు విరుద్ధంగా కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని ఆయన చెప్పారు. చట్టానికి వ్యతిరేకంగా తాము ఏ పనులూ చేయలేదని చెప్పడానికే ఈ ప్రకటన జారీ చేస్తున్నట్టు తెలిపారు. ఇది ప్రైవేట్‌ స్థలంలో నిర్మించిన భవనమని, కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన‌ అక్రమ నోటీసుపై కోర్టు స్టే కూడా ఇచ్చిందని గుర్తుచేశారు.

శనివారం ఉదయం కూల్చివేతకు ముందు కూడా తమకు ఎలాంటి నోటీసూ జారీ చేయలేదని నాగార్జున తెలిపారు. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఇలా చేయడం సరికాదన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కచ్చితంగా తానే దగ్గరుండి నేలమట్టం చేసేవాడినని ఆయన చెప్పారు. ఇప్పుడు జరిగిన పరిణామాల వల్ల, మేమేదో కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశముందని ఆయన తెలిపారు. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమని ఆయన చెప్పారు. తమ్మిడికుంట చెరువులో మూడున్నర ఎకరాలు కబ్జా చేసి ఎన్‌ కన్వెన్షన్‌ కట్టారని ఆరోపణలు రావడంతో హైడ్రా దాన్ని నేలమట్టం చేసింది. స్టే ఆర్డర్‌ ఉన్నప్పటికీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడంతో నాగార్జున కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందన్నది వేచిచూడాలి.

కోర్టు స్టే..

మరోపక్క ఎన్‌-కన్వెన్షన్‌ కూల్చివేతపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. కన్వెన్షన్‌ కూల్చివేతపై యాజమాన్యం శనివారం కోర్టును ఆశ్రయించగా, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ దీనిపై విచారణ చేపట్టారు. ఈ క్రమంలో కూల్చివేతలు ఆపాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనే ప్రభుత్వం దీనిపై నోటీసులు ఇవ్వగా, నాగార్జున కోర్టును ఆశ్రయించారని, రూ.9 కోట్లు డిపాజిట్‌గా కట్టి.. ప్రభుత్వ ఆరోపణలు నిరూపిస్తే తమ నిర్మాణానికి తగిన మార్పులు చేస్తామని అంగీకరించారని ధర్మాసనం పేర్కొంది.

First Published:  24 Aug 2024 12:39 PM GMT
Next Story