సాగర్ ఎడమ కాల్వకు గండి.. రెండు గ్రామాలను చుట్టుముట్టిన నీరు..
నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు గండి పడింది. దీంతో నల్గొండ జిల్లాలోని నిడమానూరు, నర్సింహుల గూడెం గ్రామాల ప్రజలు జల దిగ్బంధంలో చిక్కుకున్నారు.
నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు గండిపడింది. దీంతో నిడమనూరు, నర్సింహుల గూడెం గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ గ్రామాల్లో దాదాపు ఏడు అడుగుల ఎత్తులో నీరు చేరడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ప్రవాహం అంతకంతకూ ఎక్కువవుతున్న సందర్భంలో ప్రజల్ని అధికారులు వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించారు. ఆ తర్వాత ఎడమ కాల్వకు నీటిని ఆపివేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
ఎడమ కాల్వ 32.109 కి.మీ యూటీ వద్ద గండి పడింది. వరద ఉధృతికి కాల్వకట్ట పూర్తిగా తెగిపోయింది. విషయం తెలుసుకున్న అధికారులు నీటి విడుదల నిలిపివేశారు. కాల్వపై ఉన్న హాలియా, పెద్దదేవులపల్లి గేట్లను మూసి వేసి నీటి ఉధృతిని తగ్గించారు. దేవరకొండ- మిర్యాలగూడ రోడ్డుపై ఏడు అడుగుల మేర వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, హాలియా తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. ఎడమకాల్వ డిజైన్ డిశ్చార్జ్ 11 వేల క్యూసెక్కులు, అయితే గండి పడిన సమయంలో కేవలం 7 వేల క్యూసెక్కులే విడుదలవుతున్నాయి. నీటి ఉధృతి కూడా సామర్థ్యానికి లోబడే ఉందని అంటున్నారు నిపుణులు.
వేగంగా స్పందించిన అధికారులు..
సాయంత్రం గండి పడటం వల్ల ప్రజలు అప్రమత్తం అవడానికి సమయం దొరికింది. అదే రాత్రివేళలో గండి పడి ఉంటే ప్రాణ నష్టం జరిగి ఉండేదని అంటున్నారు. మొత్తమ్మీద నిడమానూరు, నర్సింహులుగూడెం ప్రజలకు పెద్ద ప్రమాదమే తప్పింది. లోతట్టు ప్రాంతంలో ఉన్న నిడమానూరు మినీ గురుకులం విద్యార్థులు హాస్టల్ నుంచి బయటకు రావడంతో ప్రాణాలతో బయటపడ్డారు. వార్డెన్ వారిని అప్రమత్తం చేసి బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత నిముషాల్లోనే గురుకులం చుట్టూ నీరు చేరింది. రెండు గ్రామాల్లోని పలు నివాసాల్లోకి నీళ్లు చేరాయి. సుమారు 500 ఎకరాల్లో పంట నీట మునిగిందని అంచనా. నీటి ఉధృతికి వరినాట్లు కొట్టుకుపోయాయి.