బలహీనపడిన అల్పపీడనం.. వర్షాలు తగ్గుముఖం
తాజాగా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అతి పెద్ద వర్షాలుగా నమోదయ్యాయి.
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్నవర్షాలకు హైదరాబాద్ నగరం అల్లకల్లోలమవుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితిలో నగర వాసులకు వాతావరణ శాఖ అధికారులు తీపి కబురు అందించారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం గురువారం ఉదయం బలహీనపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ కె. నాగరత్న తెలిపారు. దీనిపై ఆమె మాట్లాడుతూ.. ఇక భారీ వర్షాలు తగ్గుముఖం పట్టినట్టేనని చెప్పారు.
మరోపక్క తెలంగాణపై నైరుతి రుతుపవనాలు ఉద్ధృతంగా ఉన్నాయి. తాజాగా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అతి పెద్ద వర్షాలుగా నమోదయ్యాయి. హన్మకొండ సహా ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో కొన్ని చోట్ల అసాధారణమైన భారీ వర్షాలు కురిశాయి.
ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, భద్రాద్రి కొత్తగూడెం, కుమురంభీమ్ జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షం కురిసింది. ఆగస్టు రెండో వారం, సెప్టెంబరులో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయి. తీవ్ర అల్పపీడనం బలహీనపడి ప్రస్తుతం దక్షిణ ఒడిశా, పరిసరాల్లో ఉత్తరాంధ్ర వద్ద కొనసాగుతోంది. శుక్రవారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 29, 30, 31 తేదీల్లో ఎలాంటి హెచ్చరికలు లేవు" అని వాతావరణ కేంద్రం డైరెక్టర్ తెలిపారు.