Telugu Global
Telangana

అన్నిదారులు ప్రగతి భవన్ వైపే..

ప్యారాచూట్ నేతలకు టికెట్లు ఇవ్వడంలో కాంగ్రెస్ వ్యూహమేంటో తెలియడంలేదు కానీ.. సీనియర్లు, నమ్మకస్తులైన నేతలు మాత్రం హస్తానికి దూరమవుతున్నారనేది వాస్తవం.

అన్నిదారులు ప్రగతి భవన్ వైపే..
X

అన్నిదారులు ప్రగతి భవన్ వైపే అనిపించేలా ఉంది ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి. కాంగ్రెస్ కి రాజీనామా చేసిన నాగం జనార్దన్ రెడ్డి.. సీఎం కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. అంతకు ముందు ఆయనతో మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ చేసిన మంతనాలు ఫలించాయి. నేరుగా నాగం ప్రగతి భవన్ వెళ్లి.. సీఎం కేసీఆర్ ని కలసి ఆయనకు పుష్పగుచ్ఛం అందజేశారు. త్వరలోనే బీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు.


విష్ణు వర్దన్ రెడ్డి కూడా..

పీజేఆర్ తనయుడు విష్ణు వర్దన్ రెడ్డి కూడా సీఎం కేసీఆర్ ని ప్రగతి భవన్ లో కలిశారు. జూబ్లీ హిల్స్ స్థానం నుంచి టికెట్ ఆశించిన విష్ణుకి కాంగ్రెస్ హ్యాండిచ్చింది. ఆ స్థానం అజారుద్దీన్ కి కేటాయించింది. దీంతో విష్ణు, కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పేశారు. ఆయన అనుచరులు గాంధీ భవన్ పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విష్ణు కూడా సీఎం కేసీఆర్ ని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలో ఆయన బీఆర్ఎస్ లో చేరతారంటున్నారు. విష్ణు సోదరి విజయారెడ్డి బీఆర్ఎస్ తరపున కార్పొరేటర్ గా గెలిచి, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఖైరతాబాద్ నుంచి బరిలో దిగుతున్నారు. విష్ణు మాత్రం కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో బీఆర్ఎస్ వైపు వచ్చేశారు.


మొత్తానికి కాంగ్రెస్ లో సెకండ్ లిస్ట్ పెద్ద అలజడి రేపినట్టు తెలుస్తోంది. తరాలుగా కాంగ్రెస్ తో అనుబంధం ఉన్న విష్ణు వంటి నేతలు కూడా ఆ పార్టీ చేసిన మోసాన్ని తట్టుకోలేక వీడిపోతున్నారు. నాగం వంటి సీనియర్లు కూడా తమదారి తాము చూసుకుంటున్నారు. ప్యారాచూట్ నేతలకు టికెట్లు ఇవ్వడంలో కాంగ్రెస్ వ్యూహమేంటో తెలియడంలేదు కానీ.. సీనియర్లు, నమ్మకస్తులైన నేతలు మాత్రం హస్తానికి దూరమవుతున్నారనేది వాస్తవం.

First Published:  29 Oct 2023 5:13 PM GMT
Next Story