సమంత గురించి నేనేం చెప్పాలి? ఆ బంధం ముగిసిన వ్యవహారం : నాగ చైతన్య
చైతూ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆ ఇంటర్వ్యూలో సమంత గురించి కూడా ప్రశ్నించగా.. చైతూ అసహనం వ్యక్తం చేశారు. కాసేపటి తర్వాత జవాబిచ్చారు..
అక్కినేని మూడో తరం వారసుడు నాగచైతన్య, నటి సమంత ఒకప్పుడు దక్షిణాదిలోనే బెస్ట్ కపుల్ అని పేరు తెచ్చుకున్నారు. 'ఏ మాయ చేశావే' అనే సినిమాతో ఇద్దరూ ఒకేసారి హిట్ అందుకున్నారు. ఆ సినిమా షూటింగ్‌లోనే సమంత, చైతన్య మధ్య ప్రేమ పుట్టింది. టాలీవుడ్‌లో వీరిద్దరి ప్రేమ చర్చనీయాంశంగా మారింది. క్రిస్టియన్ అయిన సమంత, హిందూ అయిన నాగచైతన్య పెళ్లికి ఇంట్లో ఒప్పుకుంటారా అని అప్పట్లో తెలుగు మీడియా పుంఖానుపుంఖాలుగా వార్తలు రాసింది. కానీ ఇరు కుటుంబాలను ఒప్పించి చైతన్య-సమంత పెళ్లి చేసుకొని 'చైసామ్'గా పేరు తెచ్చుకున్నారు.
సినిమా వాళ్ల ప్రేమలు, పెళ్లిళ్లు మూన్నాళ్ల ముచ్చటే అని ఎంతో మంది విమర్శించినా.. మాది బెస్ట్ పెయిర్ అంటూ చైతూ, సామ్ ఇద్దరూ బల్లగుద్ది చెప్పారు. సోషల్ మీడియాలో తమ వంటింటి కబుర్లు, లాక్‌డౌన్ ముచ్చట్లు చాలా వెల్లడించారు. కానీ అభిమానులందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తూ సడన్‌గా విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. ఇది అభిమానులు, టాలీవుడ్ ఇండస్ట్రీకే కాకుండా దక్షిణాది సినిమా పరిశ్రమకు కూడా షాక్ ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఇద్దరూ ఎవరి లైఫ్‌ను వాళ్లు గడిపేస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో, ఇంటర్వ్యూలల్లో వీళ్లను గత బంధానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు.
ఇటీవల బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ నిర్వహించే 'కాఫీ విత్ కరణ్' షోకు అక్షయ్ కుమార్‌తో కలసి సమంత పాల్గొన్నది. అందులో కరణ్ పదే పదే 'హజ్బెండ్' అని అంటుంటే.. 'ఎక్స్ హజ్బెండ్' అంటూ సవరించింది. అంటే సమంత తాను విడిపోయిన మ్యారేజ్ గురించి ఎంత స్పష్టంగా ఉన్నదో అర్థం అవుతున్నది. తాజాగా ఇదే విషయంపై నాగ చైతన్య కూడా స్పందించాడు.
అమీర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చద్దా' అనే సినిమాలో నాగ చైతన్య కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా వచ్చే వారం (ఆగస్టు 11) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ నేపథ్యంలో చైతూ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆ ఇంటర్వ్యూలో సమంత గురించి కూడా ప్రశ్నించగా.. చైతూ అసహనం వ్యక్తం చేశారు. కాసేపటి తర్వాత జవాబిచ్చారు..
'నేను ఎన్నో సినిమాల్లో నటించాను.. నటిస్తున్నాను. కానీ నా సినిమా జీవితం కంటే నా వ్యక్తిగత జీవితమే మీడియాలో హైలైట్ కావడం చాలా బాధాకరంగా ఉన్నది. ఇది చాలా చికాకు కలిగిస్తోంది. దురదృష్టం ఏంటంటే సినీ ఫీల్డ్‌లో ఉంటే వ్యక్తిగత జీవితం కూడా వార్తగా మారుతుంది. సమంతతో జరిగిన ప్రేమ, వివాహం, విడాకుల గురించి ఇద్దరం కలసి ప్రకటించాము. ఇద్దరిదీ వేర్వేరు దారులని చెప్పాము. ఇంకా దాని గురించే ప్రశ్నిస్తే నేనేం చెప్పాలి. సమంత అనేది ముగిసిపోయిన వ్యవహారం' అని నాగ చైతన్య ఉద్వేగంగా చెప్పుకొచ్చారు.