పవన్‌కు ఎవరి నుంచి ముప్పు ఉంది..?
సోమవారం రాత్రి హైదరాబాద్ శ్రీరాంనగర్‌లో నివసించే సాయికృష్ణ చౌదరి అతడి స్నేహితులు రెస్టారెంట్‌కు వెళ్లి తిరిగి వస్తూ పవన్ కల్యాణ్ ఇంటి ముందు కారును నిలిపారు.
పవన్ కల్యాణ్ తన భద్రతపై ఆందోళన చెందుతున్నారని జనసేన చెబుతోంది. పవన్ కల్యాణ్‌ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అనుసరిస్తున్నారని ఆ పార్టీ అనుమానం వ్యక్తం చేస్తోంది. సోమవారం పవన్ కల్యాణ్ ఇంటి వద్ద జరిగిన గొడవపై జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాదెండ్ల మనోహర్ పేరుతో ఒక ప్రకటన కూడా విడుదలైంది.
పవన్ కల్యాణ్‌ను ఇటీవల అనుమానాస్పద వ్యక్తులు అనుసరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా విశాఖ ఘటన తర్వాత పవన్ ఇంటి వద్ద, పార్టీ ఆఫీస్ వద్ద ఇలా అనుమానాస్పద వ్యక్తులు ఎక్కువగా సంచరిస్తున్నారని నాదెండ్ల అనుమానం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు.. తిరిగి వచ్చేటప్పుడు కొందరు వెంబడిస్తున్నారని చెప్పారు. పవన్ కల్యాణ్ కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. అలా అనుసరిస్తున్న వారు అభిమానులు కానేకాదని భద్రతా సిబ్బంది చెబుతున్నారని నాదెండ్ల వివరించారు.
సోమవారం రాత్రి హైదరాబాద్ శ్రీరాంనగర్‌లో నివసించే సాయికృష్ణ చౌదరి అతడి స్నేహితులు రెస్టారెంట్‌కు వెళ్లి తిరిగి వస్తూ పవన్ కల్యాణ్ ఇంటి ముందు కారును నిలిపారు. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది వారిని ప్రశ్నించబోగా వారూ ఎదురు ప్రశ్నించారు. ఆ సమయంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనపై పవన్ కల్యాణ్ ఇంటి వద్ద కాపాలాగా ఉన్న బౌన్సర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సాయికృష్ణ చౌదరి, అతడి స్నేహితులతో పవన్ బౌన్సర్లకు జరిగిన గొడవపైనా నాదెండ్ల అనుమానం వ్యక్తం చేశారు. ఆ అంశాన్ని కూడా తన లేఖలో ప్రస్తావించారు. అయితే ఇందుకు ఎవరు బాధ్యులు, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలి అన్న విషయాలను మాత్రం నాదెండ్ల మనోహర్ ప్రస్తావించలేదు. పవన్ కల్యాణ్ తన చుట్టూ ఏదో జరుగుతోందని ఆందోళన చెందడం గతంలోనూ జరిగింది. టీడీపీ హయాంలో ఏపీ ప్రభుత్వం నియమించిన గన్‌మెన్లు తన విషయాలను లీక్ చేస్తున్నారంటూ వారిని తిప్పిపంపిన ఉదంతమూ ఉంది.