Telugu Global
Telangana

అయ్యో పాపం.. వద్దు వద్దు, మాకొద్దు మైనంపల్లి

సొంత పార్టీలో హరీష్ రావుని తిట్టారు, పక్క పార్టీల్లోని రేవంత్ రెడ్డిని, బండి సంజయ్ ని కూడా తిట్టారు. అలాంటి మైనంపల్లిని ఏ పార్టీ అయినా ఎలా సహిస్తుంది, కొత్త పార్టీలు ఎందుకు ఆహ్వానిస్తాయి. అందుకే అందరూ వద్దంటే వద్దని తేల్చి చెబుతున్నారు. మైనంపల్లిని క్రాస్ రోడ్స్ లో నిలబెట్టారు.

అయ్యో పాపం.. వద్దు వద్దు, మాకొద్దు మైనంపల్లి
X

మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పరిస్థితి అయోమయంలో పడింది. ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్టుగా మారింది. బీఆర్ఎస్ టికెట్ లభించినా అక్కడి కేడర్ ఆయనపై రగిలిపోతోంది. దిష్టిబొమ్మల దహనంతో విరుచుకుపడుతోంది. పైగా కేటీఆర్, కవిత కూడా మైనంపల్లికి వ్యతిరేకంగా స్టేట్ మెంట్లివ్వడంతో ఆయన పార్టీని వీడటం అనివార్యంగా మారింది. ఒకవేళ కొడుక్కి మెదక్ సీటు వద్దు అని సరిపెట్టుకున్నా.. హరీష్ రావుపై చేసిన కామెంట్ల పర్యవసానంగా మల్కాజ్ గిరిలో మైనంపల్లి గెలుపు అంత ఈజీ కాదని తెలుస్తోంది. అయినా ఆయనకు బీఆర్ఎస్ టికెట్ ఉంటుందా, లేదా అనేది కూడా అనుమానమే.

బీఆర్ఎస్ కాకపోతే కాంగ్రెస్ లోకి అనుకుంటున్న మైనంపల్లికి.. హస్తం పార్టీ నుంచి కూడా సెగ తగిలింది. ఇటీవల ఆయన ఆడియో ఒకటి వైరల్ గా మారింది. అందులో రేవంత్ రెడ్డిని తొక్కుతా అంటూ కాస్త ఘాటుగా మాట్లాడారు మైనంపల్లి. పార్టీ అధ్యక్షుడినే ఆ స్థాయిలో విమర్శించిన మైనంపల్లికి కాంగ్రెస్ లో ఎంట్రీ ఉంటుందా, ఉన్నా.. తండ్రీ కొడుకులిద్దరికీ సీట్లిచ్చేంత సీన్ ఉంటుందా అనేది అనుమానమే.

బీజేపీలో ఎంట్రీ ఉంటుందా..?

గతంలో మైనంపల్లి బండి సంజయ్ ని కూడా బూతులు తిట్టారు. అలాంటి ఆయనను తమ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదంటున్నారు బీజేపీ సీనియర్ నేత రాంచందర్ రావు. మైనంపల్లి బీజేపీలో చేరతారంటూ వస్తున్న వార్తల్ని ఆయన ఖండించారు. గతంలో మైనంపల్లి తమ పార్టీ అగ్రనేతలను దూషించాని, తమ పార్టీ కార్యకర్తలను జైలుకు పంపించారని.. అలాంటి నేతలకు బీజేపీలో చోటు ఉండదని అన్నారు రాంచందర్ రావు.

వద్దంటే వద్దు..

సొంత పార్టీలో హరీష్ రావుని తిట్టారు, పక్క పార్టీల్లోని రేవంత్ రెడ్డిని, బండి సంజయ్ ని కూడా తిట్టారు. అలాంటి మైనంపల్లిని ఏ పార్టీ అయినా ఎలా సహిస్తుంది, కొత్త పార్టీలు ఎందుకు ఆహ్వానిస్తాయి. అందుకే అందరూ వద్దంటే వద్దని తేల్చి చెబుతున్నారు. మైనంపల్లిని క్రాస్ రోడ్స్ లో నిలబెట్టారు.

First Published:  28 Aug 2023 5:45 AM GMT
Next Story