Telugu Global
Telangana

వారం తర్వాతే భవిష్యత్తు.. మైనంపల్లి తాజా స్పందన

ఏ పార్టీలో ఉన్నా తాను నిజాయితీతో ఉంటానని, వెన్నుపోటు రాజకీయాలు తనకు చేతకావన్నారు. తొందర పడొద్దంటూ ఓ కీలక వ్యక్తి తనకు సూచించారని, ఆయన మాట ప్రకారం ప్రజల అభిప్రాయం తీసుకుంటానన్నారు మైనంపల్లి.

వారం తర్వాతే భవిష్యత్తు.. మైనంపల్లి తాజా స్పందన
X

తన కొడుక్కి మెదక్ టికెట్ దక్కలేదని రగిలిపోతున్న మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అనుచరులతో సమావేశమయ్యారు. మేడ్చల్ జిల్లా దూలపల్లిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన మరో వారం రోజులు టైమ్ తీసుకుంటానన్నారు. అప్పుడే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ జాబితా విడుదలయ్యే సమయంలో తిరుమలలో ఉన్న మైనంపల్లి.. కొండపై పొలిటికల్ హాట్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్ వచ్చాక భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. తీరా ఇక్కడికి వచ్చాక మరో వారం రోజులు చర్చలు జరపాల్సిందేనంటున్నారు. తాను ఏ పార్టీని తిట్టలేదని, అన్ని పార్టీల వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పుకొచ్చారాయన. తన కొడుక్కి రాజకీయ భవిష్యత్ ఉందని, మెదక్ నుంచి ఆయన పోటీ చేయాల్సిందేనన్నారు. మరో వారం రోజులపాటు మెదక్ లో తన అనుచరులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలు తీసుకుంటానన్నారు. ఏ పార్టీలో ఉన్నా తాను నిజాయితీతో ఉంటానని, వెన్నుపోటు రాజకీయాలు తనకు చేతకావన్నారు. తొందర పడొద్దంటూ ఓ కీలక వ్యక్తి తనకు సూచించారని, ఆయన మాట ప్రకారం ప్రజల అభిప్రాయం తీసుకుంటానన్నారు.


బీఆర్ఎస్ లో నో ఛాన్స్..!

ఇంత సీన్ జరిగిన తర్వాత మైనంపల్లికి ఇక బీఆర్ఎస్ లో ఛాన్స్ లేదని తేలిపోయింది. పార్టీ కూడా మల్కాజ్ గిరిలో ఆయనకు ప్రత్యామ్నాయం చూస్తోంది. మరోవైపు నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన దిష్టిబొమ్మలు దహనం చేస్తూ నిరసనలకు దిగారు. మంత్రి హరీష్ రావుకి మద్దతుగా కేటీఆర్, కవిత కూడా మైనంపల్లిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ దశలో ఆయన బీఆర్ఎస్ లో కొనసాగే అవకాశం లేదని తేలిపోయింది. ఇప్పటికే మెదక్ బీఆర్ఎస్ టికెట్ పద్మా దేవేందర్ రెడ్డికే ఖాయం చేశారు సీఎం కేసీఆర్. అందులో పునరాలోచన లేదని తెలుస్తోంది. ఇక ఆలోచించాల్సిందన్నా మైనంపల్లి మాత్రమే. మల్కాజ్ గిరితో సరిపెట్టుకోవాలా, లేక మెదక్ కోసం నానా యాగీ చేసి బయటకొచ్చేయాలా అనేది అయన చేతుల్లోనే ఉంది. రెండు టికెట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగానే ఉన్నా.. గెలుపు విషయంలో మైనంపల్లి ఆలోచనలో పడ్డారు. అందుకే అనుచరులతో మీటింగ్ అంటూ వారం రోజులపాటు బలాబలాలు బేరీజు వేసుకోబోతున్నారు.


First Published:  26 Aug 2023 3:10 PM IST
Next Story