బీఆర్ఎస్ కు మైనంపల్లి రాజీనామా.. వేడెక్కిన మల్కాజ్ గిరి రాజకీయం
బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించినా, వేరే పార్టీలో చేరే విషయంలో ఆయన క్లారిటీ ఇవ్వలేదు. ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తానని తెలిపారు మైనంపల్లి.
తనతోపాటు తన కొడుక్కి కూడా అసెంబ్లీ టికెట్ కావాలి అది కూడా మెదక్ సీటే కావాలంటూ మంకుపట్టు పట్టిన మల్కాజ్ గిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఎట్టకేలకు బీఆర్ఎస్ ని వీడుతున్నట్టు ప్రకటించారు. దీంతో మల్కాజ్ గిరి రాజకీయం మరింత వేడెక్కింది. హన్మంతరావు కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖాయం కాగా... ఇప్పుడు అదే స్థానానికి బీఆర్ఎస్ బలమైన నాయకుడిని వెదికి పట్టుకోవాల్సి ఉంది. మల్కాజ్ గిరి, మెదక్ స్థానాల గెలుపు బీఆర్ఎస్ కి కూడా ప్రతిష్టాత్మకంగా మారింది.
వాస్తవానికి మైనంపల్లి హన్మంతరావు తనకు కూడా టికెట్ రాదు అనే ఉద్దేశంలో, బీఆర్ఎస్ టికెట్ల ప్రకటనకు ముందు తిరుమలలో హాట్ కామెంట్స్ చేశారు. తన కుటుంబానికి రెండు సీట్లు కావాలన్నారు. మెదక్ లో మంత్రి హరీష్ రావు పెత్తనం నడుస్తోందని విమర్శించారు. కానీ సీఎం కేసీఆర్ ప్రకటించిన ఫస్ట్ లిస్ట్ లో మైనంపల్లి పేరుంది, మెదక్ టికెట్ విషయంలో మాత్రం మైనంపల్లి కోరిక నెరవేరలేదు. ఆయన పార్టీపై అలిగినా, పరోక్షంగా బ్లాక్ మెయిల్ చేయాలని చూసినా.. ఫలితం లేకుండా పోయింది. ‘టికెట్ కేటాయించాం. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలా? లేదా అనేది ఆయన ఇష్టం’ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత.. మైనంపల్లి వ్యాఖ్యలను ఖండించిన విషయం తెలిసిందే. స్థానికంగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా మైనంపల్లికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేపట్టాయి. దీంతో మైనంపల్లికి సెగ మొదలైంది. మల్కాజ్ గిరి టికెట్ కేటాయించినా కూడా చివరకు ఆయన పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు.
మైనంపల్లి బీఆర్ఎస్ కి దూరమవుతారన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఆయనకు గేలం వేయాలని చూశాయి. మల్కాజ్ గిరి, మెదక్ రెండు సీట్లూ ఇస్తామంటూ బేరాలు పెట్టాయి. మైనంపల్లి కాంగ్రెస్ వైపు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించినా, వేరే పార్టీలో చేరే విషయంలో ఆయన క్లారిటీ ఇవ్వలేదు. ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తానని తెలిపారు మైనంపల్లి.