నావి అబద్ధపు వాగ్దానాలు కావు : రాహుల్ గాంధీ
తెలంగాణలో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని రాహుల్ పునరుద్ఘాటించారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ విమర్శలు ఘాటుగానే తగిలినట్లు ఉన్నాయి. రెండు రోజులుగా తెలంగాణలో సభలు, యాత్రలు చేస్తూ కాంగ్రెస్ కోసం ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీ.. ఇప్పుడు డిఫెన్స్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలు, తాను ఇస్తున్న వాగ్దానాలు అబద్ధాలు కావని చెబుతున్నారు. తాజాగా మోర్తాడులో బస్సు యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ.. అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
తెలంగాణలో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని పునరుద్ఘాటించారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతీ నెల మహిళలకు రూ.2,500 భృతి, బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని తెలిపారు. ఇవి అబద్ధపు వాగ్దానాలు కావని.. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాలో ఇచ్చి, అమలు చేస్తున్న వాగ్దానాలే అని చెప్పారు.
తెలంగాణ ప్రజలతో మాకు ఉన్నది రాజకీయ, ఎన్నికల అనుబంధం కాదని.. మనది కుటుంబ అనుబంధమని చెప్పారు. నెహ్రూ, ఇందిరమ్మ కాలం నుంచి ఈ బంధం కొనసాగుతోందని చెప్పారు. మా గెలుపును అడ్డుకోవడానికి ఎప్పుడూ కొన్ని శక్తులు సిద్ధంగా ఉంటాయని దుయ్యబట్టారు. మహారాష్ట్ర, అస్సాం, రాజస్థాన్‌తో సహా తాము ఎక్కడ బీజేపీతో పోటీ చేసినా అక్కడ ఎంఐఎం పార్టీ అభ్యర్థులను పోటీకి దింపుతోందని ఆరోపించారు.
బీజేపీతో పోరాడుతున్నందుకే నాపై కేసులు పెట్టి, లోక్‌సభ సభ్యత్వం రద్దు చేశారు. నాకు ఇల్లు లేకుండా ఖాళీ చేయించారు. నాకు ఇల్లు లేకుండా చేయగలిగారేమో కానీ.. కోట్లాది మంది భారతీయుల హృదయాల నుంచి బయటకు పంపలేరని రాహుల్ భావోద్వేగం చెందారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని.. ప్రజా తెలంగాణ ఏర్పడటం ఖాయమని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు.