నేనలా అనలేదు.. నా వ్యాఖ్యలు వక్రీకరించారు : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
తాను అన్న మాటలను మీడియాలో వక్రీకరించారని వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో రాహుల్ గాంధీ చెప్పిన విషయాలనే తాను ఉటంకించానని.. అంతే తప్ప కొత్తగా తాను ఏ అనుచిత వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మీడియాలో దుమారం రేపాయి. మీడియాలో వచ్చిన స్క్రోలింగ్స్ చూసి కాంగ్రెస్ సీనియర్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఏఐసీసీ ప్రతినిధి మాణిక్ రావు ఠాక్రే వెంటనే హైదరాబాద్ వస్తున్నట్లు పార్టీ నాయకులకు చెప్పారంటే.. కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఎంత తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయో అర్థం అవుతోంది. కాగా, మీడియాలో వస్తున్న కథనాలు చూసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెంటనే నష్టనివారణ చర్యలకు దిగారు.
తాను అన్న మాటలను మీడియాలో వక్రీకరించారని వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో రాహుల్ గాంధీ చెప్పిన విషయాలనే తాను ఉటంకించానని.. అంతే తప్ప కొత్తగా తాను ఏ అనుచిత వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు. పార్టీలోని చిన్న చిన్న నేతలు కూడా తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతున్నారని వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన మాటలను పట్టుకొని బీజేపీ నాయకులు కూడా రాద్దాంతం చేస్తున్నారని బండి సంజయ్‌ను ఉద్దేశించి అన్నారు. అసలు హంగ్ వస్తుందని గానీ, బీఆర్ఎస్‌తో పొత్తు ఉంటుందని గానీ తాను మాట్లాడలేదని తేల్చి చెప్పారు. బీజేపీని ఎదుర్కోవాలంటే బీఆర్ఎస్ వంటి సెక్యులర్ పార్టీలతో జత కలవాలని మాత్రమే అన్నానని స్పష్టం చేశారు.
తనకు ఇప్పుడు పార్టీలో ఎలాంటి పదవులు లేవని, కేవలం భువనగిరి నియోజకవర్గం అభివృద్ధి పైనే దృష్టి పెట్టినట్లు చెప్పారు. అందులో భాగంగానే తాను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని కలిసినట్లు చెప్పుకొచ్చారు. ఉదయం తాను చేసిన వాఖ్యలు అర్థమయ్యే వారికే అర్థమవుతాయంటూ ఆసక్తికరంగా మాట్లాడారు. మొత్తానికి తన వ్యాఖ్యలు రివర్స్ కొడుతున్నాయని తెలుసుకొని సాయంత్రానికి ఖండనకు దిగడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.