50వేల కోట్లు, 70వేల కోట్లు, లక్షా యాభైవేల కోట్లు
పనులు ప్రారంభం కాకముందే మూసీ బడ్జెట్ మూడు రెట్లు పెరిగిందని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ కి బంగారుబాతులా మూసీ ప్రాజెక్ట్ మారిందని, వాటాలు పంచుకోవడమే మిగిలుందని ఎద్దేవా చేస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూసీ నది ప్రక్షాళణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. గతంలో మూసీ మురుగునీరు విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చాక ఆ సమస్య తాము పరిష్కరిస్తామని, మూసీ పరివాహక ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. ఆమధ్య లండన్ పర్యటనలో కూడా థేమ్స్ నది పరివాహక ప్రాంతాలను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి.. అదే తరహాలో మూసీ ప్రక్షాళణ కొనసాగుతుందన్నారు. అప్పట్లో ఆయన మూసీ ప్రక్షాళణకు కేటాయిస్తామన్న బడ్జెట్ రూ.50వేల కోట్లు.
ఆ తర్వాత కొన్నాళ్లకు మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా మూసీ సుందరీకరణ పనులపై మీడియాతో మాట్లాడారు. అప్పటికి ఆయన ప్రకటించిన అంచనా బడ్జెట్ రూ.70వేల కోట్లు. అంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన బడ్జెట్ కంటే రూ.20వేల కోట్లు ఎక్కువ. రేవంత్ రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్ లో 50వేల కోట్ల రూపాయల బడ్జెట్ అని ప్రకటించగా, రెండు నెలల వ్యవధిలోనే మంత్రి జూపల్లి దాన్ని రూ.70వేల కోట్లకు పెంచడం విశేషం. దీనిపై బీఆర్ఎస్ అప్పట్లోనే విమర్శలు ఎక్కుపెట్టింది. ఇప్పుడు మరోసారి విమర్శలకు తావిస్తూ సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళణ అంచనా బడ్జెట్ ని లక్షా యాభైవేల కోట్ల రూపాయలకు పెంచేశారు. దీంతో మరోసారి బీఆర్ఎస్ నుంచి కౌంటర్లు పడ్డాయి. పనులు ప్రారంభం కాకముందే మూసీ బడ్జెట్ మూడు రెట్లు పెరిగిందని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ కి బంగారుబాతులా మూసీ ప్రాజెక్ట్ మారిందని, వాటాలు పంచుకోవడమే మిగిలుందని ఎద్దేవా చేస్తున్నారు.
ఆకలితో కొట్టుకుంటున్న #స్కాంగ్రెస్ రాబందుల కడుపు నింపుకునేందుకు బంగారు బాతులా మారిన మూసీ ప్రాజెక్టు
— BRS Party (@BRSparty) July 20, 2024
పనులు ప్రారంభం కాకుండానే 3 రెట్లు పెరిగిన మూసీ ప్రాజెక్టు అంచనా వ్యయం
అంటే అంచనా 50,000 కోట్ల నుండి 1,50,000 కోట్లకు పెరిగింది..
వాటాలు పంచుకోవడమే ఇక తరువాయి! pic.twitter.com/Wr2KZIWpWS
తాజాగా గోపన్ పల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు లండన్‌లోని థేమ్స్ నది తరహాలో మూసీ సుందరీకరణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారాయన. అదే సమయంలో ఆ కార్యక్రమానికి లక్షా యాభైవేల కోట్లు కేటాయించబోతున్నట్టు కూడా ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ వర్గాలు మరోసారి మూసీ వ్యవహారంపై సెటైర్లు పేలుస్తున్నాయి.