Telugu Global
Telangana

మూసీమే లూటో.. దిల్లీ మే బాంటో

ఇదే కాంగ్రెస్‌ కొత్త నినాదం.. బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

మూసీమే లూటో.. దిల్లీ మే బాంటో
X

మూసీమే లూటో.. దిల్లీ మే బాంటో అన్నది కాంగ్రెస్‌ కొత్త నినాదం అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. పేదల ఇండ్ల మీదికి బుల్డోజర్లు వస్తే అడ్డుకుంటామన్నారు. రేవంత్‌ రెడ్డి కాదు.. ఆయన తాత వచ్చినా ఏమీ చేయలేరన్నారు. మంగళవారం అంబర్‌పేట్‌ నియోజకవర్గంలోని గోల్నాక డివిజన్‌ లోని మూసీ ప్రాజెక్ట్‌ బాధిత ప్రజలను ఆయన కలిసి ఓదార్చారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ, ఎప్పుడు కట్టుకున్న ఇండ్లను ఇప్పుడు కూల్చివేయడం ఏమిటని ప్రశ్నించారు. హైదరాబాద్‌ లోని గరీబోళ్లంతా కాంగ్రెస్‌ కు వ్యతిరేకంగా ఉన్నారని వాళ్ల బతుకులను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర బడ్జెట్‌ లో సగం డబ్బులతో మూసీ ప్రాజెక్టు చేపటి, ఇక్కడి ప్రజలను అడవిలోకి పంపుతున్నారని అన్నారు. పేదల ఇండ్లు కూల్చేస్తుంటే ఈ ప్రాంత ఎంపీ ఎక్కడ పోయారని ప్రశ్నించారు. తెలంగాణలో పెద్ద పండుగ దసరా అని.. ఈ పండుగకు హైదరాబాద్‌ లో లక్షలాది మందికి నిద్రలేకుండా రేవంత్‌ రెడ్డి చేశారన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు అడ్డగోలు హామీలిచ్చిన కాంగ్రెస్‌ పార్టీ వాటి అమలు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందన్నారు.

కాంగ్రెస్‌ వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని చెప్పారని.. ఇండ్లు కూలగొట్టమని ఇందిరమ్మ.. సోనియమ్మ చెప్పిందా అని ప్రశ్నించారు. పేదల ఇండ్లను కూలగొట్టి మాల్స్‌, పార్కులు కడుతామంటున్నారని.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పేదలకు అండగా ఉంటామని చెప్పి.. గద్దెనెక్కిన తర్వాత వాళ్లను ఏడిపిస్తున్నారని అన్నారు. ఒక్క అంబర్‌పేట నియోజకవర్గంలోనే 16 వందల కుటుంబాలను రోడ్లపై పడేస్తున్నరని, కానీ బయటికి చెప్పే లెక్కలు వేరున్నయన్నారు. ఈ ఒక్క చోటనే 40 వేల కుటుంబాలు, లక్షన్నర మందిని రోడ్డు మీద పడేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. 2400 కిలోమీటర్ల నమామీ గంగ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ ప్రభుత్వం రూ.20 వేల కోట్లు ఖర్చుపెడితే.. 55 కిలోమీటర్ల మూసీ ప్రాజెక్టుకు రేవంత్‌ రెడ్డి రూ.1. 50 లక్షల కోట్లు ఖర్చు చేస్తుందట? అది ఎవరి సొమ్ము అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఇదే ప్రాజెక్టుకు రూ.16 వేల కోట్లు అవుతాయని లెక్కగట్టామని, ఒకేసారి పది రెట్లు ఎలా పెరిగిందో చెప్పాలన్నారు. నిర్వాసితులను విడగొట్టే ప్రయత్నాలు చేసే వారిని తరిమికొట్టాలన్నారు. అప్పుడే పేదల ఇండ్లు నిలబడతాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీని మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటుతో జాడిచ్చి కొట్టాలన్నారు. ప్రజల హక్కులు గుంజుకునే అధికారం ఎవరికీ లేదన్నారు. కేసీఆర్‌ పేదలకు అండగా ఉన్నారని, పేదల ఇండ్లు పోకుండా చూసే బాధ్యత తమది అన్నారు. అధికారులు రాస్తున్న ఆర్‌బీఎస్‌ అనే అక్షరాలు తుడిపేసి కేసీఆర్‌ అని రాయాలని సూచించారు. రేవంత్‌ రెడ్డి లాంటోడు మంచిగా చెప్తే వినడని.. ప్రజల తిరుగుబాటుతోనే దిగి వస్తాడన్నారు. ఆయన వెంట మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌ గౌడ్‌, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్‌, ముఠా గోపాల్‌, సుధీర్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.

First Published:  1 Oct 2024 7:46 PM IST
Next Story