Telugu Global
Telangana

మునుగోడు:రూ.1 కోటి సీజ్... పరారీలో కోమటిరెడ్డి సుమంత్ రెడ్డి, సూర్య పవన్ రెడ్డి

మునుగోడు ఎన్నిక దగ్గరపడుతుండటంతో డబ్బులు నీళ్ళలా పంపిణీ అవుతున్నాయి. అనేక చోట్ల పోలీసుల సోదాల్లో కోట్ల రూపాయల సొమ్ము పట్టుబడుతోంది. నిన్న మునుగోడులో కోమటిరెడ్డి సుమంత్ రెడ్డి, సూర్య పవన్ రెడ్డి లకు ఇవ్వడానికి తీసుకెళ్తున్న కోటి రూపాయల నగదును సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.

మునుగోడు:రూ.1 కోటి సీజ్... పరారీలో కోమటిరెడ్డి సుమంత్ రెడ్డి, సూర్య పవన్ రెడ్డి
X

మునుగోడు ఎన్నిక నేపథ్యంలో డబ్బులు విచ్చలవిడిగా పంపకాలు జరుగుతున్నాయి. ఒక ఓటుకు తులం బంగారం ఇవ్వడానికి బీజేపీ అభ్యర్థి రాజ గోపాల్ రెడ్డి రెడీ అయ్యాడని మంత్రి కేటీఆర్ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో విస్త్రుతంగా సోదాలు నిర్వహిస్తున్న పోలీసులకు కోట్ల రూపాయల డబ్బు పట్టుబడుతోంది.

శనివారంనాడు హైదరాబాద్ మణికొండలోని ఓ విల్లా నుంచి కోటి రూపాయల నగడును తీసుకొని నలుగురు వ్యక్తులు మునుగోడు వెళ్ళడానికి ఓ కారులో బయలు దేరారు. కారు నార్సంగి రోటరీ వద్దకు వచ్చే సమయానికి అక్కడ పోలీసులు ఉన్నారు. వారిని చూసిన డ్రైవర్ కారు వేగాన్ని పెంచాడు. అనుమానం వచ్చిన పోలీసులు కారును వెంబడించి పట్టుకున్నారు. కారులో సోదా చేయగా కోటి రూపాయలు నగదు లభించింది. దాంతో వారిని అదుపులోకి తీసుకొని విచారణ జరపగా వారు మునుగోడు వెళ్తున్నట్టు చెప్పారు. మునుగోడులోని కోమటి రెడ్డి సుమంత్ రెడ్డి, కోమటిరెడ్డి సూర్య పవన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డిల కు ఈ డబ్బు ఇవ్వడానికివెళ్తున్నట్టు వెల్లడించారు.

వెంటనే పోలీసులు పై అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన అధికారులు కోమటి రెడ్డి సుమంత్ రెడ్డి, కోమటిరెడ్డి సూర్య పవన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డిల కోసం గాలించగా వారు పరారీలో ఉన్నట్టు తెలిసింది. ఇక్కడ కారులో సొమ్ము పట్టుబడిన విషయం తెలియగానే ఆ ముగ్గురు పరారయినట్టు పోలీసులు చెప్తున్నారు.

కాగా ఈ నెల 17వ తేదీన మునుగోడు మండలం చల్మెడ చెక్ పోస్టు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తుండగా, కరీంనగర్ జిల్లాకు చెందిన బీజేపీ కౌన్సిలర్ భర్త వాహనంలో రూ. కోటి రూపాయల నగదు పట్టుబడిన విషయం తెలిసిందే.

నిన్న ఉదయం యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ సమీపంలోని పంతంగి టోల్‌ ప్లాజా వద్ద ఓ కారులో పోలీసులు సోదా చేయగా రూ.20 లక్షలు లభించాయి.

ఈ నెల 18న మునుగోడు నియోజయకవర్గంలోని గట్టుప్పల్ శివారులో రూ.19 లక్షల నగదు పట్టుబడింది. ఈనెల 13న పంతంగి చెక్ పోస్ట్ వద్ద ఓ కారులో రూ.13 లక్షలు పట్టుబడిన విషయం తెలిసిందే.

ఇక ఎన్నికలు జరిగే నవంబర్ 3వ తేదీ లోపు ఎంత సొమ్ము పట్టుబడుతుందో ఎంత సొమ్ము పట్టుబడకుండా పంపకాలకు వెళ్తుందో చూడాలి.

First Published:  23 Oct 2022 8:08 AM IST
Next Story